Kalvakuntla Kavitha: కేంద్ర ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ..
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీకి సుదీర్ఘ లేఖ పంపిన వారు, తమ పార్టీపై వచ్చిన వెయ్యి అభ్యంతరాల కాపీలను ముందుగా అందజేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే ఆమోదించి, గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సుదీర్ఘ లేఖ ద్వారా రిప్లయ్ ఇచ్చారు. దేశంలో ఒకే రకమైన పేర్లతో వందలాది పార్టీలు ఉన్నప్పుడు.. తమ పార్టీ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద ప్రతిపాదిత తెలంగాణ రక్షణ సేన పార్టీ గుర్తింపు దరఖాస్తును ఆమోదించి, నిష్పాక్షికమైన ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.
మాపై వచ్చిన ఆ 1,000 అభ్యంతరాల కాపీలు ఇవ్వండి!
తమ పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని జూన్ 23న ఎన్నికల సంఘం లేఖ రాసిందని, అయితే వాటిలో ఒక్క కాపీని కూడా ఇంతవరకు తమకు పంపలేదని ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పేర్కొన్నారు. అసలు అభ్యంతరాలు ఎవరు వ్యక్తం చేశారు? అందులో ఏముందో మాకు తెలియకుండా మేము సమాధానం ఎలా చెప్పగలం? తెలంగాణలో మూడున్నర కోట్ల జనాభా ఉంటే కేవలం 1,000 అభ్యంతరాలను చూపించి రిజిస్ట్రేషన్ ఆపడం హేతుబద్ధం కాదన్నారు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈసీ ముందు వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందే మాకు ఆ అభ్యంతరాల కాపీలన్నీ అందజేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
పేరు మార్చమంటే తీవ్ర నష్టం
ఈ ఏడాది ఏప్రిల్ 28న కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అనే పేరును కేటాయిస్తూ తమకు అధికారికంగా లేఖ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈసీ ఆమోదాన్ని నమ్ముకుని ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి, సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు అకస్మాత్తుగా పేరు మార్చుకోవాలని చెబితే పార్టీకి తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల పేర్ల పోలికలను నిర్ధారించేటప్పుడు పూర్తి పేరును సమగ్ర రూపంగా చూడాలి తప్ప.. అందులోని విడి పదాలను ముక్కలు చేసి చూడకూడదని ఈసీకి సూచించారు. ఈసీ ప్రస్తావిస్తున్న తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రాటిక్), తెలంగాణ రాజ్య సమితి అనేవి వేర్వేరు ఉచ్చారణ, వేర్వేరు నాయకత్వం కలిగిన పార్టీలని.. వాటితో తమ తెలంగాణ రక్షణ సేనకు ఎలాంటి పోలిక లేదని స్పష్టం చేశారు.
దేశంలో ఒకే పేరుతో వందలాది పార్టీలు లేవా?
గతంలో కేవలం ఒకే రకమైన భౌగోళిక వర్ణనాత్మక లేదా సిద్ధాంతపరమైన పదాలు ఉన్నాయనే కారణంతో ఏ పార్టీ రిజిస్ట్రేషన్‌నూ నిరాకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ఆమ్ ఆద్మీ, అఖండ్ భారత్, మక్కల్, ప్రజా సేవ, జన్ అధికార్, రాష్ట్రీయ జనతా వంటి ఒకే తరహా పదాలతో వందలాది పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయని, వీటికి సంబంధించిన జాబితాను కూడా లేఖకు జత చేశారు.కేవలం ఊహాజనిత సంక్షిప్త రూపాలు , సాధారణ భౌగోళిక పదాల ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తిరస్కరించాలని కోరారు.
