Video: లక్నో స్టేడియంలో ఫ్యాన్స్ వీరంగం.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నరు.. ఎందుకంటే?
LSG vs DC Fans Fight Video: లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ విషాదకర సంఘటనకు వేదికైంది. లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో ప్రేక్షకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు సాగుతుంటే, గ్యాలరీలో అభిమానులు పరస్పరం భౌతిక దాడులకు దిగడం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

LSG vs DC Fans Fight Video: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చివరకు పెద్ద గొడవకు దారితీసింది. స్టేడియం లోపలే అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి. ఘర్షణకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. గొడవ ముదరడంతో వెంటనే స్పందించిన పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీశారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..
మ్యాచ్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ తమ అద్భుత బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చారు. ఇంకా రెండు ఓవర్ల సమయం మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది.
రిషబ్ పంత్ నిర్ణయంపై పీటర్సన్ విమర్శలు..
Huge fight between LSG and DC fans during the LSG vs DC match at Ekana Stadium, Lucknow.😱 pic.twitter.com/DeGlMaiZZT
— Sonu (@Cricket_live247) April 2, 2026
మరోవైపు, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రావడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయిన పంత్, ఇప్పుడు అనవసరంగా ఓపెనింగ్ చేసి తనపై తాను ఒత్తిడి పెంచుకుంటున్నాడని పీటర్సన్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్, దురదృష్టవశాత్తు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రన్ అవుట్ అయి వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ కొట్టిన షాట్ బౌలర్ చేతికి తగిలి వికెట్లను తాకడంతో పంత్ నిష్క్రమించాల్సి వచ్చింది.
రూ. 27 కోట్ల ధర.. కానీ పేలవ ప్రదర్శన..
గతేడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అయితే, ఆ భారీ ధరను పంత్ తన బ్యాటింగ్‌తో సమర్థించుకోలేకపోయాడు. గత సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన సగటు కేవలం 24.45గా ఉండటం గమనార్హం. ఒక సెంచరీ సాధించినప్పటికీ, అప్పటికే జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ ఇన్నింగ్స్ వృథా అయ్యింది. ఓపెనింగ్ స్థానంలో ఒత్తిడికి గురికాకుండా, పాత స్థానంలోనే బ్యాటింగ్ చేస్తూ ఆటను ఆస్వాదించాలని పీటర్సన్ సూచించాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
