PAK vs WI: బాబర్ అజామ్ సరికొత్త రికార్డ్.. ఆ దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన పాక్ కెప్టెన్..!
Babar Azam stats vs West Indies Test 2026: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా బాబర్ అజామ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడు. విమర్శకులకు బ్యాట్‌తోనే జవాబు చెప్తూ అతడు సాధిస్తున్న ఈ రికార్డులు రాబోయే కాలంలో మరిన్ని శిఖరాలను తాకడం ఖాయం.

PAK vs WI: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ క్రికెట్ మైదానంలో మరొక అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ను అధిగమించాడు. జాతీయ జట్టు తరఫున అత్యధిక అర్థశతకాలు బాదిన రికార్డుల్లో జావేద్ మియాందాద్ సరసన స్థానం సంపాదించుకున్నాడు.
గత కొంతకాలంగా సరైన ఫామ్ లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజామ్ బ్యాట్‌తో మళ్లీ సమాధానం చెప్పాడు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్న వేళ అత్యంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 344 పరుగుల భారీ స్కోరు సాధించిన తర్వాత బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తడబడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బాబర్ అజామ్ ఓపికగా బ్యాటింగ్ చేస్తూ అర్థశతకంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
ఇమ్రాన్ ఖాన్ రికార్డు బద్దలు.. మియాందాద్ సరసన..
ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీతో బాబర్ అజామ్ అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సరికొత్త ఎత్తుకు ఎదిగాడు. ఇప్పటివరకు లెజెండరీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న 115 యాభై ప్లస్ స్కోర్ల రికార్డును బాబర్ దాటేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 116వ సారి యాభైకి పైగా పరుగులు సాధించి పాక్ మాజీ దిగ్గజం జావేద్ మియాందాద్ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం బాబర్ కంటే ముందు ఇంజమామ్ ఉల్ హక్ (129), మహమ్మద్ యూసుఫ్ (118), యూనిస్ ఖాన్ (117) మాత్రమే ఉన్నారు.
వెస్టిండీస్‌పై తిరుగులేని ఆధిపత్యం..
కరేబియన్ జట్టుపై బాబర్ అజామ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. మొదటి టెస్టులోనూ నాటౌట్‌గా 58 పరుగులు చేసి జట్టును ఆదుకున్న బాబర్, ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. కష్ట సమయాల్లో నమ్మకమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ కరేబియన్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత బ్యాటర్‌గా స్వేచ్ఛగా ఆడుతున్న బాబర్, కీలక సమయాల్లో పరుగులు సాధిస్తూ జట్టును ముందంజలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో కీలకం..
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ విజయం అత్యంత అవసరం. సిరీస్‌ను 1-1తో సమం చేయాలంటే మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ భారీ ఆధిక్యం సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడైన బాబర్ అజామ్ బాధ్యతారాహిత్యంగా ఆడకుండా సుదీర్ఘ సమయం క్రీజులో నిలవడం పాక్ శిబిరానికి పెద్ద ఊరటనిచ్చింది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఇన్జమామ్ ఉల్ హక్ రికార్డును కూడా బాబర్ త్వరలోనే దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




