AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?

CSK vs DC IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్ల మెరుపుల కంటే 19వ ఓవర్‌లో జరిగిన ఒక వింత సంఘటన, అంపైర్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

IPL 2026: చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
Csk Vs Dc
Rakesh
|

Updated on: Apr 12, 2026 | 7:14 AM

Share

IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. శనివారం రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించి, ఈ సీజన్‌లో తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్ల మెరుపుల కంటే 19వ ఓవర్‌లో జరిగిన ఒక వింత సంఘటన, అంపైర్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ ఓటమికి అంపైర్ నిర్ణయమే కారణమా? అనే చర్చ మొదలైంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నిరాశపరిచినప్పటికీ, సంజు శాంసన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే(59) అతనికి వెన్నుదన్నుగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగులకు పైగా జోడించడంతో చెన్నై భారీ స్కోరు సాధించింది. చివర్లో శివమ్ దూబే (20) కూడా మెరుపులు మెరిపించాడు.

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లోనే తడబడింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (38 బంతుల్లో 60 పరుగులు) క్రీజులో ఉన్నంత సేపు ఢిల్లీకి గెలుపు ఆశలు ఉన్నాయి. చెన్నై బౌలర్ జేమీ ఓవర్టన్ 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ వంటి హేమాహేమీలు విఫలం కావడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 189 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 23 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందుకుంది.

ఢిల్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ తన చేతి గ్లోవ్స్ చెమట వల్ల తడిచిపోయి పట్టు కోల్పోవడంతో వాటిని మార్చుకోవాలని భావించాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్లోవ్స్ తీసుకురావాలని సైగ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ల సూచన మేరకు ఫోర్త్ అంపైర్ గ్లోవ్స్ మార్చడానికి అనుమతి నిరాకరించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఓవర్ మధ్యలో గ్లోవ్స్ చిరిగిపోతే తప్ప, కేవలం చెమట కోసం వాటిని మార్చుకోవడానికి అనుమతించరు. ఇది సమయాన్ని వృథా చేయడమేనని అంపైర్లు భావించారు.

అంపైర్ నిర్ణయంతో ఢిల్లీ డగౌట్ ఒక్కసారిగా షాక్ తిన్నది. ఢిల్లీ కోచ్, సహాయక సిబ్బంది ఫోర్త్ అంపైర్‌తో తీవ్రంగా వాదించారు. గ్లోవ్స్ మార్చుకోలేకపోయిన స్టబ్స్, అదే ఓవర్‌లో బంతిని సరిగ్గా హిట్ చేయలేక క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంపైర్లు గ్లోవ్స్ మార్చనివ్వకపోవడం వల్లే స్టబ్స్ ఏకాగ్రత దెబ్బతిన్నదని, అందుకే అతను అవుట్ అయ్యాడని ఢిల్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, ఈ సంఘటన ఐపీఎల్ 2026లో ఒక కొత్త వివాదానికి తెరలేపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us