IPL 2026 : ఐపీఎల్ స్టార్లకు బీసీసీఐ వార్నింగ్.. రూల్స్ బ్రేక్ చేస్తే కెరీర్ రిస్క్‌లో పడటం ఖాయం
IPL 2026 : ఐపీఎల్ 2026లో భద్రతా నియమాలు ఉల్లంఘిస్తున్న ఆటగాళ్లు, ఫ్రాంచైజీలపై బీసీసీఐ సీరియస్ అయింది. అనుముతి లేని వ్యక్తుల ప్రవేశంపై కఠిన చర్యలు తీసుకోనుంది. రియాన్ పరాగ్ వేపింగ్ చేస్తూ పట్టుబడడం, రాజస్థాన్ రాయల్స్ మొబైల్ వాడడం పై బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, ఆటగాళ్ల క్రమశిక్షణ, భద్రతా నియమాల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మైదానంలో ఆట కంటే బయట జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆటగాళ్లు, అధికారుల గదుల్లోకి అనుమతి లేని వ్యక్తులు ప్రవేశిస్తున్నారనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఫ్రాంచైజీలకు, ఆటగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అసలేం జరిగింది? బీసీసీఐ సీరియస్ ఎందుకు?
ఐపీఎల్ జట్లతో సంబంధం లేని వ్యక్తులు టీమ్ బస్సుల్లో ప్రయాణించడం, ఆటగాళ్లు, అధికారుల గదుల్లోకి అక్రమంగా ప్రవేశించడం వంటి ఘటనలు బీసీసీఐ దృష్టికి వచ్చాయి. ఇది యాంటీ కరప్షన్ ప్రోటోకాల్స్ (అవినీతి నిరోధక నియమాలు)కు విరుద్ధమని సైకియా స్పష్టం చేశారు. ఆటగాళ్ల భద్రత, ఐపీఎల్ గౌరవాన్ని కాపాడటం తమ బాధ్యతని, ఇలాంటి అక్రమ ప్రవేశాలను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు నేటి సాయంత్రం(మే 8 2026) ఒక కొత్త అడ్వైజరీ (మార్గదర్శకాలు) విడుదల చేయనున్నట్లు తెలిపారు.
రాజస్థాన్ రాయల్స్ చుట్టూ వివాదాలు
గత నెలలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించిన రెండు ప్రధాన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గౌహతిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయారు. దీనికి గాను ఆయనకు రూ.1 లక్ష జరిమానా విధించి హెచ్చరించారు. ఆ తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కనిపించారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనలు పబ్లిక్ డొమైన్‌లో ఉండటం బీసీసీఐ ప్రతిష్టను దెబ్బతీస్తోందని సైకియా ఆవేదన వ్యక్తం చేశారు.
డగౌట్ పవిత్రత, టీమ్ ఓనర్ల జోక్యం
మ్యాచులు జరుగుతున్నప్పుడు టీమ్ ఓనర్లు, ఉన్నతాధికారులు ఆటగాళ్లతో రిస్ట్రిక్టెడ్ ఏరియాల్లో కలవడంపై కూడా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. డగౌట్ అనేది ఆటగాళ్లు మరియు కోచింగ్ స్టాఫ్ కు మాత్రమే పరిమితం కావాలని, అక్కడ నిబంధనల అమలులో జాప్యం జరుగుతోందని సైకియా అభిప్రాయపడ్డారు. రూల్స్ ఎవరికైనా ఒకటేనని, ఓనర్లు అయినా, స్టార్ ప్లేయర్లు అయినా నియమాలను పాటించాల్సిందేనని ఆయన కరాఖండీగా చెప్పారు.
కఠిన చర్యలు తప్పవు
బీసీసీఐ కార్యదర్శి మాటలను బట్టి చూస్తే, ఐపీఎల్ లో ఇకపై ఉదారతకు తావు లేదని అర్థమవుతోంది. భవిష్యత్తులో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆటగాళ్లను సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఐపీఎల్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, దీని వెనుక ఉన్న క్రమశిక్షణ, భద్రత అత్యంత ముఖ్యమని బోర్డు భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
