PBKS vs RCB IPL 2022 Prediction: బెంగళూరును ఢీ కొట్టేందుకు సిద్ధమైన పంజాబ్.. ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ మెగా సమరం మొదలైంది. శనివారం (మార్చి26) ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.
ఐపీఎల్ మెగా సమరం మొదలైంది. శనివారం (మార్చి26) ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కాగా ఆదివారం నుంచి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే డబుల్ హెడర్. మొదటి మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ (MI vs DC) తలపడతుండగా, రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(PBKS vs RCB) సిద్ధమంటోంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 ప్రారంభమవుతుంది. కాగా ప్రతిసారి టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న పంజాబ్, బెంగళూరు జట్లు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. మరి కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లతో ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకుంటాయేమో చూడాలి. అయితే ప్రారంభ మ్యాచ్‌ల్లో కీలక ఆటగాళ్లు లేకపోవడం ఇరుజట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
కీలక ఆటగాళ్లు దూరం..
బెంగళూరు విషయానికొస్తే.. ప్రధాన ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్‌లు తొలి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ కూడా పాకిస్థాన్ పర్యటనలో ఉన్నందున ఏప్రిల్ 6వరకు జట్టులో చేరడు. మరోవైపు పంజాబ్‌ది కూడా ఇదే పరిస్థితి. జట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లు కగిసో రబడా, జానీ బెయిర్‌స్టో మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నారు. బెయిర్‌స్టో వెస్టిండీస్ టూర్‌లో ఉండటంతో రెండో మ్యాచ్‌కు కూడా డౌటే.
కొత్త కెప్టెన్లతో బరిలోకి..
కాగా ఈ సీజన్‌లో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి. బెంగళూరుకు విరాట్ కోహ్లీ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్, పంజాబ్‌కు కేఎల్ రాహుల్ ప్లేస్‌లో మయాంక్ అగర్వాల్ సారథులుగా వ్యవహరించనున్నారు. కాగా ఐపీఎల్‌లో నాయకత్వం వహించడమనేది వీరిద్దరికి మొదటిసారి. అయితే డుప్లెసిస్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెప్టెన్సీ అనుభవం ఉంది. దక్షిణాఫ్రికా జట్టుకు గొప్ప విజయాలు అందించాడు. అతనికి తోడుగా విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ వంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు, మయాంక్ మొదటిసారిగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. జట్టులో చాలామంది కూడా యంగ్ ప్లేయర్లే.
బెంగళూరు బౌలింగ్ వర్సెస్ పంజాబ్ బ్యాటింగ్..
కాగా ఈ మ్యాచ్‌ని పంజాబ్ బ్యాటింగ్‌కు, బెంగళూరు బౌలింగ్‌కు మధ్య పోటీ అని భావించవచ్చు. ఎందుకంటే మెగా వేలం తర్వాత ఇరు జట్లను పరిశీలిస్తే .. పంజాబ్ కంటే RCB మెరుగైన జట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా డుప్లెసిస్ దళంలో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లీల పేస్ బౌలర్లకు తోడు వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్ వంటి స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే బ్యాటింగ్ లో మాత్రం పంజాబ్‌తో పోలిస్తే ఆర్బీసీ కాస్త బలహీనంగా ఉందని చెప్పవచ్చు. బాధ్యతలన్నీ కెప్టెన్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీపై నే ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు లేకపోవడం బెంగళూరుకు ప్రధాన లోటు. మ్యాక్సీ స్థానంలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది.
ఓపెనర్లే బలం.. అదే సమయంలో పంజాబ్ బ్యాటింగ్ పటిష్ఠంగా ఉంది. ఓపెనింగ్‌లో కెప్టెన్ మయాంక్, శిఖర్ ధావన్‌ల బలమైన జోడీ ఉండగా, మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్, షారూఖ్ ఖాన్, లోయర్ ఆర్డర్‌లో ఓడిన్ స్మిత్‌ల బలం ఉంది. అండర్-19 జట్టులోని స్టార్ ఆల్ రౌండర్ రాజంగద్ బావాకు కూడా ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అయితే కీలక బౌలర్ రబడ లేకపోవడం బౌలింగ్‌పై ప్రభావం చూపవచ్చు. అర్ష్‌దీప్ సింగ్,సందీప్ శర్మ, రిషి ధావన్ ఇషాన్ పోరెల్ వంటి యంగ్ బౌలర్లు ఏమేర ప్రభావం చూపుతారో చూడాలి. అయితే స్పిన్ విభాగంలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ ఉండడం పంజాబ్‌కు సానుకూలాంశం.
బెంగళూరు స్క్వాడ్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, మహిపాల్ లోమోర్డ్, డేవిడ్ విల్లీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, , సిద్ధార్థ్ కౌల్, ఫిన్ అలెన్, లవ్‌నీత్ సిసోడియా, అనిశ్వర్ గౌతమ్, సుయాష్ ప్రభుదేశాయ్, ఆకాష్ దీప్, చామ మిలింద్.
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: పీబీకేఎస్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, ఇషాన్ పోరెల్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, సందీప్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, బెన్నీ హౌవెల్, అథర్వ తైదే, అన్ష్ పటేల్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ బావా, రిషి ధావన్, షారుఖ్ ఖాన్, హృతిక్ ఛటర్జీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.
Also Read:Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి
Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!
RRR Movie: ఆర్ఆర్ఆర్కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..