GT vs LSG, IPL 2022 Match Prediction: అరంగేట్రంలో ఆధిపత్యం ఎవరిదో? కొత్త జట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ (IPL-2022)లో కొత్తగా రెండు జట్లు చేరిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింంట్స్ (LSG), హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ (GT) ..
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ (IPL-2022)లో కొత్తగా రెండు జట్లు చేరిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింంట్స్ (LSG), హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ (GT) మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈక్రమంలో సోమవారం (మార్చి 28) ముంబైలోని వాంఖడే మైదానంలో తొలిపోరుకు సిద్ధమయ్యాయి. కాగా ఐపీఎల్‌లో మొదటిసారి పాల్గొంటోన్న ఈ నుండే జట్ల బలాలు, బలహీనతలను ఒకసారి పరిశీలిస్తే..లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్ కెఎల్ రాహుల్ రూపంలో అత్యుత్తమ బ్యాటర్ ఉన్నాడు. అతనికి తోడుగా దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్‌కు డికాక్‌లు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా అనుమానంగానే ఉంది. వీరే కాకుండా మనీష్ పాండే, ఎవిన్ లూయిస్ రూపంలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇక అవసరమైన సమయాల్లో బ్యాట్ ఝుళిపించేందుకు కృనాల్ పాండ్యా, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే ప్రారంభ మ్యాచ్‌లకు విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ లేకపోవడం లక్నోకు లోటే అని చెప్పవచ్చు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన స్టార్ పేసర్ అవేష్ ఖాన్‌పైనే రాహుల్ సేన ఆశలు పెట్టుకుంది. అతనికి మద్దతుగా దుష్మంత చమీర్, రవి బిష్ణోయ్, షాబాజ్ నదీమ్ ఏ మేర రాణిస్తారో చూడాలి.
గుజరాత్‌కు బౌలింగే బలం.. ఇక గుజరాత్ విషయానికి వస్తే.. ఈ ఫ్రాంఛైజీ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను పెద్దగా తీసుకోలేదు. టోర్నీకి ముందే జాసన్ రాయ్ తప్పుకోవడం హార్ధిక్ సేనకు పెద్ద షాక్. అయితే బౌలింగ్ విషయంలో లక్నోతో పోలిస్తే ఈ జట్టు కొంచెం బలంగా ఉంది. మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్ లాంటి పేస్‌బౌలర్లతో పాటు రషీద్ ఖాన్ లాంటి అంతర్జాతీయ స్పిన్నర్లు ఉన్నారు. వారికి మద్దతుగా R సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్ వంటి ఆల్‌రౌండర్లు కూడా బంతిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కొన్ని రోజులుగా గాయాలతో సతమతమవుతోన్న హార్దిక్ బౌలింగ్ చేస్తాడా? లేదా? అనేది ఆసక్తికరమే. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, వృద్ధిమాన్ సాహాలపైనే ఆశలు పెట్టుకుంది.
ఆటగాళ్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..
ఇక వ్యక్తిగత గణంకాల విషయానికొస్తే.. ఐపీఎల్ కెరీర్‌లో 3,560 పరుగులు చేసిన లక్నోకు చెందిన మనీష్ పాండే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. ఆ జట్టు కెప్టెన్ రాహుల్ 134 సిక్సర్లతో ముందంజలో ఉన్నాడు. ఇక అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గుజరాత్ జట్టులో అత్యధికంగా 2,110 పరుగులు చేశాడు. అదే సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 98 సిక్సర్లు బాదాడు. బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లక్నో జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా క్రునాల్ పాండ్యా నిలిచాడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ముంబై తరఫున ఆడుతూ 51 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో 93 వికెట్లు తీసిన వెటరన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ జట్టుకు పెద్ద బలం. రెండు జట్లు మొదటిసారి ఐపీఎల్‌లో ఆడనున్నాయి. ఆటగాళ్ల బలబలాలు చూస్తే లక్నో కంటే గుజరాత్ టైటాన్స్ కాస్త బలంగా కనిపిస్తోంది. మరి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే..
IPL 2022: రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్.. ఢిల్లీ మ్యాచ్‌లో గాయపడిన తుఫాన్ బ్యాటర్..