AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs ENG W: ఇంగ్లండ్‌పై ఘనవిజయం.. ఆల్ రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్న భారత మహిళలు..

India Womens Beat England Womens: 292 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు షఫాలీ వర్మ (33), స్మృతి మంధాన (26) శుభారంభం అందించారు. ఆ తర్వాత జెమీమా 27 ​​పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 44 పరుగులు చేసింది.

IND W vs ENG W: ఇంగ్లండ్‌పై ఘనవిజయం.. ఆల్ రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్న భారత మహిళలు..
Indw Vs Engw Test Series
Venkata Chari
|

Updated on: Dec 16, 2023 | 11:52 AM

Share

India vs England: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇంగ్లండ్ మహిళల జట్టు (England Women’s) తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు (India Women’s) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా (Team India) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఆ తర్వాత 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఆదుకున్నారు.

అరంగేట్ర ఆటగాళ్లు శుభా సతీష్ (69), జెమీమా రోడ్రిగ్స్ (68) అర్ధ సెంచరీలు చేసి జట్టును తొలి షాక్ నుంచి కాపాడగా, ఆ తర్వాత యాస్తిక భాటియా (66), దీప్తి శర్మ (67) అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగులకు ఆలౌటైంది.

దీని తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల కచ్చితమైన ధాటికి తడబడింది. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ బంతులను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ పరేడ్ నిర్వహించారు.

ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 136 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరపున దీప్తి శర్మ 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, స్నేహ రాణా 2 వికెట్లు తీసి మెరిసింది.

292 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు షఫాలీ వర్మ (33), స్మృతి మంధాన (26) శుభారంభం అందించారు. ఆ తర్వాత జెమీమా 27 ​​పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 44 పరుగులు చేసింది.

దీంతో 2వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అయితే, మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే డిక్లేర్ చేసి ఇంగ్లండ్ జట్టును రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది.

479 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. టామీ (17), పూజా వస్త్రాకర్, సోఫియా డంక్లీ (15), నాట్ షివర్-బ్రంట్ (0), హీథర్ నైట్ (21)లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా రేణుకా సింగ్ తొలి విజయాన్ని అందుకుంది.

మరోవైపు దీప్తి శర్మ డేనియల్ వ్యాట్ (12), అమీ జోన్స్ (5)లను పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో సోఫీ ఎక్లెస్టోన్ (10) వికెట్ కోల్పోయింది.

చివరకు ఇంగ్లండ్‌ను కేవలం 131 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా 347 పరుగులతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

ఇండియా ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), స్నేహ రాణా, శుభా సతీష్, పూజ వస్త్రాకర్, రేణుకా ఠాకూర్ సింగ్, రాజేశ్వరి గైక్వాడ్.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: టామీ బ్యూమాంట్, సోఫియా డంక్లీ, హీథర్ నైట్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, డేనియల్ వాట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్ , కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..