Ind W vs SA W World Cup Final Highlights: ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం.. ప్రపంచ విజేతగా హర్మన్ ప్రీత్ సేన
India vs South Africa, Women’s World Cup 2025 Final Highlights in Telugu: సెమీఫైనల్లో భారత్ ఏడుసార్లు ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా నాలుగుసార్లు విజేతలుగా నిలిచిన ఇంగ్లాండ్‌ను ఓడించింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. టోర్నమెంట్ లీగ్ దశలో కూడా ఇరుజట్లు తలపడ్డాయి. అక్కడ దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో చివరి మ్యాచ్‌ను గెలిచింది.

India vs South Africa, Women’s World Cup 2025 Final Highlights in Telugu: 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళలు ఎట్టకేలకు చరిత్ర సృష్టించారు. ఆదివారం నవీ ముంబైలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళలు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించారు. దీంతో మహిళల క్రికెట్‌లో కూడా టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 87, దీప్తి శర్మ 58, స్మృతి మంధాన 45, రిచా ఘోష్ 34 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరపున అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టింది.
భారీ లక్ష్యాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ చేసినప్పటికీ జట్టును విజయపథంలో నడిపించలేకపోయింది. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టింది.
రెండు జట్లలోని ప్లేయింగ్ XI..
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్జ్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, క్రాంతి గౌర్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్.
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్జ్, సునే లూస్, మారిజాన్ కాప్, అన్నరీ డెరెక్సెన్, అన్నేకే బాష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నోంకులులెకో మ్లాబా.
LIVE NEWS & UPDATES
-
ప్రపంచ విజేతగా భారత్..
47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళలు ఎట్టకేలకు చరిత్ర సృష్టించారు. ఆదివారం నవీ ముంబైలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత మహిళలు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించారు. దీంతో మహిళల క్రికెట్‌లో కూడా టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
-
మలుపు తిప్పిన దీప్తి
దక్షిణాఫ్రికా 43 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లకు 229 పరుగులు చేసింది. నాడిన్ డి క్లెర్క్ (8 పరుగులు), అయబొంగా ఖాకా (0) ఇంకా క్రీజులో ఉన్నారు. దీప్తి శర్మ 42వ ఓవర్లో లారా వోల్వార్డ్ట్ (101 పరుగులు), క్లోయ్ ట్రయాన్ (9 పరుగులు)లను అవుట్ చేసి, ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చింది.
-
-
6వ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
డేంజరస్‌గా మారిన జోడీని దీప్తి శర్మ విడగొట్టింది. డెరెక్సన్ వికెట్ తీసి సౌతాఫ్రికాకు షాకిచ్చింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.
-
200లకు చేరువలో సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా 36 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (86), అన్నేర్ డెరెక్సన్ (25) క్రీజులో ఉన్నారు.
-
ఒక బంతికి 13 పరుగులు ఇచ్చిన రాధా
32వ ఓవర్లో, రాధా యాదవ్ లీగల్ డెలివరీలో 13 పరుగులు ఇచ్చింది. ఆ ఓవర్ చివరి బంతికి ఆమె హై ఫుల్ టాస్ వేసింది. అన్రే డెరెక్సన్ దానిని సిక్స్‌గా మలిచింది. అంపైర్ దానిని నో-బాల్‌గా ప్రకటించింది. డెరెక్సన్ ఫ్రీ హిట్‌లో కూడా సిక్స్ కొట్టింది.
-
-
5వ వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా 30 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (74 పరుగులు), అన్నేర్ డెరెక్సన్ (1 పరుగు) క్రీజులో ఉన్నారు. దీప్తి శర్మ బౌలింగ్‌లో సినాలో జాఫ్తా క్యాచ్ ఔట్ అయింది.
-
4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా 22.1 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 124 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ దూకుడుగా కనిపిస్తోంది. తన 2 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టింది. దీంతో సౌతాఫ్రికాను కష్టాల్లోకి నెట్టింది.
-
100 పరుగులు దాటిన సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికా 18 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ (56), సునే లూయస్ (11) క్రీజులో ఉన్నారు. వోల్వార్డ్ తన అర్ధ సెంచరీని చేరుకుంది.
-
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
బ్రిట్స్ ఔట్ అయిన వెంటనే సౌతాఫ్రికాకు మరో దెబ్బ తగిలింది. శ్రీ చరణి తన మొదటి ఓవర్‌లోనే నడిన్ బాష్‌ను పెవిలియన్‌కు పంపింది. బంతి లెగ్, మిడిల్ స్టంప్ మధ్య పిచ్ అయ్యింది. బాష్ ఫ్లిక్ ఆడటానికి ప్రయత్నించింది కానీ పూర్తిగా మిస్ అయ్యింది. బంతి నేరుగా ప్యాడ్స్‌కు తగిలింది. అంపైర్ ఆలస్యం చేయకుండా వేలు ఎత్తారు. ఈ నిర్ణయం ఖచ్చితంగా సరైనది. బంతి నేరుగా స్టంప్స్‌ను తాకింది. బాష్ ఓపెన్ చేయకుండానే 6 బంతులు ఆడి సున్నా పరుగులకే ఔట్ అయ్యింది. భారత్‌కు ఈ విధంగా రెండవ పెద్ద వికెట్ లభించింది.
-
తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
అమన్జోత్ డైరెక్ట్ హిట్. బ్రిట్స్ ఇన్నింగ్స్‌కు తెర, భారత్‌కు తొలి విజయం.. దక్షిణాఫ్రికా 9.5 ఓవర్ల తర్వాత 52/1
-
50 పరుగులు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఇప్పుడు పూర్తిగా పటిష్టంగా మారింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అమన్‌జోత్ కౌర్ ఓవర్‌లో వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా ఆమె లెగ్ సైడ్‌లో వేసిన చెత్త బంతిని వెనుక స్క్వేర్ దిశగా అందంగా ఫ్లిక్ చేసింది. ఆపై తర్వాతి బంతికి మిడ్‌వికెట్ మీదుగా స్ట్రోక్ కొట్టి వరుసగా ఫోర్ సాధించింది. భారత బౌలర్లు ఇప్పటివరకు ప్రారంభ విజయం సాధించలేకపోయారు. వోల్వార్డ్ట్ 24, బ్రిట్స్ 23 పరుగులతో ఆడుతున్నారు. సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. భారత జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.
-
సౌతాఫ్రికాకు మంచి ఓపెనింగ్
దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. లారా వోల్వార్డ్ట్ 15 పరుగులు, తాజ్‌మిన్ బ్రిట్స్ 14 పరుగులతో ఆడుతున్నారు. ఆఫ్రికా ఇంకా గెలుపుకు 266 పరుగులు దూరంలో ఉంది.
-
మంచి ఓపెనింగ్ ఇచ్చిన వోల్వార్డ్ట్, బ్రిట్స్
నాలుగో ఓవర్‌లో రేణుక సింగ్ బంతుల్లో సౌతాఫ్రికా ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ అద్భుతమైన కంట్రోల్ ప్రదర్శించింది. భారత పేసర్ మంచి లైన్ వేసినప్పటికీ మరోసారి స్వింగ్ ప్రయోజనాన్ని పొందలేకపోయింది. ఓవర్ నాలుగో బంతికి రేణుక కాస్త ఎక్కువ ఫుల్ బంతిని వేయగా, వోల్వార్డ్ట్ దాన్ని చక్కగా టైమింగ్ చేసి లెగ్ సైడ్‌లో బౌండరీకి పంపింది. అంతకుముందు ఆమె కొన్ని బంతులను తెలివిగా వదిలేస్తూ సంయమనం చూపింది. ఇప్పుడు భారత జట్టుకు తొలి వికెట్ అవసరం, ఎందుకంటే ఆఫ్రికన్ జోడి వోల్వార్డ్ట్, బ్రిట్స్ నెమ్మదిగా ఫామ్ లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నారు. నాలుగు ఓవర్ల తర్వాత స్కోర్ 18/0.
-
ఆరంభంలోనే ఒక కీలకమైన రివ్యూను కోల్పోయిన భారత్
రేణుక సింగ్ రెండవ ఓవర్‌లో భారత్ ఒక విలువైన రివ్యూను కోల్పోయింది. తాజ్‌మిన్ బ్రిట్స్‌కు వ్యతిరేకంగా ఎల్‌బీడబ్ల్యూ అప్పీల్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చివరి సెకనులో డీఆర్‌ఎస్‌ను తీసుకున్నారు.. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్ వెలుపల వెళుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీనికి ముందు కూడా ఒక బంతికి రేణుక గట్టిగా అప్పీల్ చేసింది, కానీ ఆ సారి కూడా బంతి స్వింగ్ అయ్యి లెగ్ వైపు వెళ్లిపోయింది. రెండు ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది.
-
4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 13/0
299 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న దక్షిణాఫ్రికా 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. లారా వోల్వార్డ్ట్ ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి. టీమిండియా ఆమెను త్వరగా అవుట్ చేయాలి.
-
రన్ ఛేజ్ చేయడానికి దిగిన సౌతాఫ్రికా జట్టు
299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగింది. లారా వోల్వార్డ్ట్, తాజ్‌మిన్ బ్రిట్స్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. వోల్వార్డ్ట్ స్ట్రైక్‌లో ఉండగా, టీమిండియా తరఫున రేణుకా సింగ్ బౌలింగ్ ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ భారీ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత భారత బౌలర్లపై ఉంది. ఇప్పుడు భారత్, వరల్డ్ కప్ ట్రోఫీ మధ్య పెద్ద దూరం లేదు.
-
సౌతాఫ్రికా టార్గెట్ 299
టీమిండియా 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 298 రన్స్ చేసింది. సౌతాఫ్రికా టార్గెట్ 299
భారత్ బ్యాటింగ్: షెఫాలి వర్మ 87, దీప్తి శర్మ 58.. స్మృతి మంధాన 45, రిషా ఘోష్ 34
-
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
292 పరుగుల వద్ద రిచా(34) అవుట్ అయింది.
-
ప్రపంచ కప్‌లో భారీ రికార్డు సృష్టించిన దీప్తి
దీప్తి శర్మ మరోసారి తాను టీమిండియా పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ ఎందుకో నిరూపించుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె మహిళల ప్రపంచ కప్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ఒకే ఎడిషన్‌లో 200 పరుగులు, 15 వికెట్లు పూర్తి చేసిన మొదటి క్రీడాకారిణిగా దీప్తి నిలిచింది. ఆమె ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత్‌ను పటిష్టమైన స్థితికి చేర్చింది. రిచా ఘోష్‌తో ఆమె భాగస్వామ్యం అద్భుతంగా ఉంది. ఇద్దరూ కలిసి చివరి ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచారు. ఫైనల్ మ్యాచ్ లో దీప్తి శర్మ 53 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో భారత జట్టుకు 5వికెట్లు నష్టపోయిన 286పరుగులు చేసింది.
-
భారీ స్కోర్ దిశగా భారత్
47 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ 277
-
ఐదో వికెట్ కోల్పోయిన భారత్
అమన్జోత్ కౌర్ 12 పరుగులకే ఔట్ అయింది. భారత్ 5వ వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ ప్రస్తుతం 43 పరుగులతో ఆడుతోంది. మరోవైపు రిచా ఘోష్ నుంచి వేగవంతమైన బ్యాటింగ్ ఆశిస్తున్నారు.. అందుకు అనుగుణంగానే రాగానే ఓ భారీ సిక్స్ బాదింది. టీమిండియా 44 ఓవర్లలో 253 పరుగులు చేసింది.
-
20 పరుగులకే హర్మన్‌ప్రీత్ కౌర్ ఔట్
భారత్‌కు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాన్‌కులులేకో మ్లాబా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు. మ్లాబా వైడ్ యాంగిల్ నుంచి బంతిని విసిరింది. అది 74.5 కిమీ/గం వేగంతో నేరుగా స్టంప్స్‌ను తాకింది. హర్మన్‌ప్రీత్ వెనుక ఉండి బంతిని జాగ్రత్తగా ఆడటానికి ప్రయత్నించింది, కానీ మిస్ అయ్యి బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. వికెట్ పడగానే మ్లాబా చాలా ఉత్సాహంగా కనిపించింది. ఈ వికెట్‌తో భారత్‌కు ఐదో వికెట్ రూపంలో భారీ దెబ్బ తగిలింది, ఎందుకంటే హర్మన్‌ప్రీత్ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది.
-
దీప్తి సిక్సర్, పరుగుల వేగం పెంచిన బ్యాటర్లు
దీప్తి శర్మ 33వ ఓవర్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టింది. మరిజాన్ కాప్ ఓవర్‌లో పరుగులు తీయడం కష్టమవుతున్నప్పుడు, దీప్తి ముందుకు వచ్చి ఆఫ్ స్టంప్ దగ్గరగా ఉన్న ఫుల్ బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా నేరుగా స్టాండ్స్‌లోకి పంపింది. ఈ షాట్ జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడింది. ఈ ఓవర్‌ను బౌలర్ నియంత్రించడం సులభం కాలేదు, ఎందుకంటే ఆ తర్వాత నిరంతరంగా స్ట్రైక్ రొటేషన్ కొనసాగింది. కాప్ ఓవర్ నుంచి మొత్తం 10 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ స్కోర్ 195/3. ఇప్పుడు హర్మన్‌ప్రీత్, దీప్తి ఇద్దరూ క్రీజ్‌లో నిలబడి పరుగుల వేగాన్ని పెంచుతున్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్..
సెమీఫైనల్ సెంచరీ హీరో రోడ్రిగ్స్ కేవలం 24 పరుగులకే పెవిలియన్ చేరింది. దీంతో భారత్ తమ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం దీప్తి శర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉన్నారు.
-
భారత్ రెండో వికెట్ కోల్పోయింది..
దక్షిణాఫ్రికా బౌలర్ ఖాక బౌలింగ్ లో షఫెలి వర్మ అవుట్ అయింది. తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. 87 పరుగుల దగ్గర తన వికెట్ కోల్పోయింది.
-
మొదటి వికెట్ కోల్పోయిన భారత్
స్మృతి మంధాన 45 పరుగులకే ఔట్ అయింది. షఫాలి హాఫ్ సెంచరీ పూర్చి చేసుకుంది. అదే సమయంలో టీమిండియా 100 పరుగులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం భారత్ 19.0 ఓవర్లకు 111/1 వద్ద ఉంది.
-
16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా భారత్ 92 పరుగులు
షెఫాలీ వర్మ ఈ రోజు అద్భుతమైన ఫామ్ లో ఉంది. హాఫ్ సెంచరీకి చాలా దగ్గరగా ఉంది. నాడిన్ డి క్లెర్క్ ఓవర్‌లో ఆమె సిక్సర్ కొట్టి స్టేడియంలో ఉత్సాహం నింపింది. ఈ ఓవర్ నుంచి భారత్‌కు మొత్తం తొమ్మిది పరుగులు లభించాయి. షెఫాలీ 42 బంతుల్లో 45 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అంచున ఉంది. స్మృతి మంధానా 48 బంతుల్లో 34 పరుగులు చేసి ఆమెకు సపోర్ట్ ఇస్తోంది. ఇద్దరు బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన సమన్వయంతో భారత ఇన్నింగ్స్ బలోపేతం అవుతోంది. 14 ఓవర్ల తర్వాత స్కోరు 89/0 అయింది. సౌతాఫ్రికా బౌలర్లు ఇప్పటివరకు ఈ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడంలో విఫలమయ్యారు.
-
అదిరిపోయే ఆరంభం అందించిన స్మృతి, షఫాలీ
తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా భారత్ 64 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ ఓపిక, దూకుడుతో బ్యాలెన్స్ ప్రదర్శించారు. స్మృతి 35 బంతుల్లో 27 పరుగులతో నిలకడగా నిలవగా, షఫాలీ 25 బంతుల్లో 29 పరుగులతో మంచి స్థితిలో ఉంది. తొలి ఓవర్లలో జాగ్రత్తగా ఆడిన తర్వాత, ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఇప్పుడు తమ స్ట్రోకులు ఆడటంలో సౌకర్యంగా ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ పడగొట్టడానికి కష్టపడుతున్నారు.
-
షెఫాలీ ఫోర్ల మోత
నవీ ముంబైలో షెఫాలీ వర్మ బ్యాట్ గర్జించింది. మరిజాన్ కాప్ బంతుల్లో ఆమె వరుసగా రెండు ఫోర్లు కొట్టి ప్రేక్షకులలో ఉత్సాహం నింపింది. మొదటి బంతికి షెఫాలీ ఫ్లిక్ షాట్ ఆడింది, బంతి ఫీల్డర్‌ను దాటి మిడ్‌వికెట్ బౌండరీకి చేరుకుంది. దీని వెంటనే తర్వాతి బంతికి అద్భుతమైన కవర్ డ్రైవ్ ఆడి మరో ఫోర్ కొట్టింది. షెఫాలీ కేవలం 18 బంతుల్లో 22 పరుగులు చేసింది. స్మృతి మంధాన 20 బంతుల్లో 17 పరుగులు చేసి ఆమెకు తోడుగా ఉంది. వికెట్ నష్టపోకుండా భారత్ 45 పరుగులు చేసింది.
-
బ్యాటింగుకు దిగిన టీమిండియా
స్మృతి, షెఫాలీ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్ ట్రోఫీ ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
-
టాస్ గెలిచిన సౌతాఫ్రికా
చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని చూస్తుంది.
-
కరుణించిన వరుణుడు.. మ్యాచుకు తొలగిన అడ్డంకి
వర్షం ఆగిపోయింది, మ్యాచ్ అధికారులు ఇద్దరు కెప్టెన్లను సమావేశానికి పిలిచారు. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి మంధాన మీటింగ్‌కు వెళ్లారు. స్వల్ప చిరుజల్లుల సమయంలో డగౌట్‌కు తిరిగి వెళ్లిన భారత ఆటగాళ్లు కూడా తిరిగి మైదానంలోకి వచ్చారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.32 గంటలకు టాస్, సాయంత్రం 5 గంటలకు మొదటి బంతి పడే అవకాశం ఉంది.
-
రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే ఏం జరుగుతుంది?
రిజర్వ్ డే రోజున కూడా నవీ ముంబైలో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు కూడా నగరంలో రోజంతా వర్షం పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు, ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే, విజేత జట్టును ఎలా నిర్ణయిస్తారు?.. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే, రెండు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత మహిళల జట్టు , దక్షిణాఫ్రికా మహిళల జట్టు ట్రోఫీని పంచుకుంటాయి.
-
5 గంటల తర్వాత తగ్గనున్న ఓవర్లు
నవీ ముంబైలో నిరంతరంగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, సాయంత్రం 5 గంటల తర్వాత ఓవర్లను తగ్గించడం మొదలవుతుంది. 20-20 ఓవర్ల మ్యాచ్‌కి కట్-ఆఫ్ సమయం రాత్రి 9.08 గంటలు.
-
ఫైనల్ మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
మధ్యలో వర్షం ఆగిపోయింది. కవర్లలో ఒక పొరను కూడా తొలగించారు, కానీ మరోసారి వర్షం మొదలైంది. ఇప్పుడు కవర్లను మళ్లీ వేశారు. ప్రస్తుతం మ్యాచ్ ప్రారంభం గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే, ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరగకపోతే ఈ టైటిల్ మ్యాచ్ రేపు, అంటే సోమవారం నవంబర్ 3న ఆడబడుతుంది. ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేను కేటాయించింది.
-
వర్షం పడుతున్నా తగ్గని అభిమానుల జోష్
వర్షం పడుతున్నప్పటికీ, నవీ ముంబైలో జరుగుతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌లో వాతావరణం ఉత్సాహంగా ఉంది. నిరంతరాయంగా వర్షం కురుస్తున్నప్పటికీ, ప్రేక్షకులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. మైదానంలో అద్భుతమైన వాతావరణం నెలకొంది. అయితే 3:15 గంటల వరకు పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇది ఉదయం నుంచి ఇప్పటివరకు కురిసిన అత్యంత భారీ వర్షం. అయినప్పటికీ, వర్షం తీవ్రత ఇప్పుడు తగ్గింది అనేది ఊరటనిచ్చే విషయం. ప్రేక్షకులలో ఆశలు చిగురించాయి. గ్రౌండ్‌స్టాఫ్ మైదానంలోకి రాగానే పెద్ద ఎత్తున చప్పట్లు, నినాదాలు మార్మోగాయి. పైన ఆకాశం కూడా ఇప్పుడు కొంతవరకు స్పష్టంగా కనిపిస్తోంది.
-
నవీ ముంబైలో అకస్మాత్తుగా భారీ వర్షం!
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడు పగబట్టాడు. వాతావరణ నివేదికలు ఆందోళన వ్యక్తం చేసినట్లే, అనుకోకుండా నవీ ముంబైలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇప్పటికే ఖరాబైన ఔట్‌ఫీల్డ్ కారణంగా ఆలస్యం అవుతుందని భావించిన మ్యాచ్ ప్రారంభం ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి, టాస్ మధ్యాహ్నం 3 గంటలకు, మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ వర్షం కారణంగా ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది.
-
పైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
భారత్ సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతుంది. వర్షం, తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
-
సౌతాఫ్రికా జట్టు
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నేకే బోష్/మసబాటా క్లాస్, అన్నరీ డెర్క్‌సెన్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లో ట్రయోన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగకులే, అయాబొంగాలుకా,
-
నవీ ముంబైలో వర్షం
నవీ ముంబైలోని క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీని వల్ల మ్యాచ్ ఆలస్యం కావచ్చు.
-
టీమిండియా జట్టు
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ రానా, అరుంధేత్రీ రెడ్డి, ఉమా ఛెత్రీ రెడ్డి, ఉమా.
-
India W vs South Africa W Live: పిచ్ రిపోర్ట్
డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంటారు. అందువల్ల, ఈ రోజు అధిక స్కోరు మ్యాచ్ చూడవచ్చు. స్పిన్నర్లకు ఇక్కడ కొంత సహాయం లభించే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లకు కూడా ఈ పిచ్ నుంచి కొంత సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్ అక్టోబర్ 30న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో మహిళల వన్డే జట్టు అత్యధిక లక్ష్యమైన 339 పరుగులు సాధించింది.
-
India W vs South Africa W Live: 3వ ఫైనల్
మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఆడనున్న మూడో మ్యాచ్ ఇది. గతంలో జరిగిన రెండు ఫైనల్స్‌లోనూ టీమిండియా ఓడిపోయింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2017లో ఇంగ్లాండ్ భారత్ కలను చెడగొట్టింది.
-
India W vs South Africa W Live: హెడ్ టూ హెడ్ రికార్డులు
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 34 ODIలు ఆడాయి. వీటిలో 20 మ్యాచ్‌లలో భారత జట్టు గెలిచింది. దక్షిణాఫ్రికా 13 మ్యాచ్‌లలో గెలిచింది. ఇంకా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
-
India W vs South Africa W Live: వెదర్ రిపోర్ట్
నవీ ముంబైలో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. మ్యాచ్ రోజున నవీ ముంబైలో వర్షం పడే అవకాశం 63 శాతం ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్ కు ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. అంటే నవంబర్ 2న మ్యాచ్ పూర్తి కాకపోతే, నవంబర్ 3న పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
-
భారత్, సౌతాఫ్రికా తుది పోరుకు రెడీ
25 సంవత్సరాల తర్వాత, మహిళల వన్డే ప్రపంచ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలిచే రోజు చివరకు రానే వచ్చింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. రెండు జట్లు ఎప్పుడూ ట్రోఫీని గెలుచుకోలేదు.
Published On - Nov 02,2025 1:50 PM




