India vs Pakistan: ఆస్ట్రేలియాలో భారత్-పాక్ వన్డే సిరీస్ జరగనుందా? క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కీలక ప్రకటన..
భారత్-పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు సిరీస్‌ను నిర్వహించాలనే ఉద్దేశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వ్యక్తం చేసింది. ఈ మేరకు మేం సిద్ధమే అంటూ పేర్కొంది.
ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్(India vs Pakistan) జట్లు తలపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాలు ముక్కోణపు సిరీస్‌లో కూడా పోటీపడనున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈమేరకు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు చీఫ్ నిక్ హాక్లీ కూడా ఇలాంటి సూచనలే వెల్లడించారు. భారత్ – పాకిస్థాన్, ఆస్ట్రేలియాల మధ్య ముక్కోణపు సిరీస్‌ను నిర్వహించాలనే ఉద్దేశాన్ని బుధవారం హాక్లీ వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా ముక్కోణపు సిరీస్ (India-Pakistan-Australia Tri-Series)లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) చీఫ్ పేర్కొనడం విశేషం. 2012లో చివరిసారిగా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. కాగా, ఇరు జట్లు ముక్కోణపు సిరీస్‌లో తలపడితే, అది క్రికెట్ అభిమానులకు నిజంగా పెద్ద వార్తే అని చెప్పొచ్చు.
జనవరిలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా కూడా ఇదే విషయంపై పలు సూచనలు చేశారు. నాలుగు దేశాల సిరీస్‌ను ఏర్పాటు చేయాలని ఐసీసీని కోరినట్లు ప్రకటించారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్‌లు నాలుగు దేశాల సిరీస్‌ని నిర్వహించడానికి సుముఖంగా ఉన్నాయని రమీజ్ రాజా తెలిపారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ హాక్లీ ముక్కోణపు సిరీస్ గురించి మాట్లాడారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు దీనిపై చర్చించలేదని, అయితే అది జరిగితే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.
భారత్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా ముక్కోణపు సిరీస్?
క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ హాక్లీ మాట్లాడుతూ, ‘వ్యక్తిగతంగా, నాకు ముక్కోణపు సిరీస్ అంటే ఇష్టం. అంతకుముందు కూడా అభిమానుల అభిమానాన్ని పొందాయి. మేం అలాంటి సిరీస్‌ల నిర్వహణకు అనుకూలంగా ఉన్నాం. ఆస్ట్రేలియాలో లక్షలాది మంది భారతీయ, పాకిస్తానీ మూలాలున్నవారు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌లు ముక్కోణపు సిరీస్‌లో ఆడటం కష్టమే..
భారత్-పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్ జరగడం కష్టం. 2023 వరకు టీమిండియా షెడ్యూల్ ఇప్పటికే నిర్ణయించారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌లోనే భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుండగా, ఇప్పటికే ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన బీసీసీఐ ముందుకు వస్తే ఒప్పుకుంటుందా? అనేది సందేహంగా ఉంది. ఆర్థికంగా, ఇది మూడు బోర్డులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయంగా పలు సమస్యలు నెలకొన్నాయి. దీంతో ఈ సిరీస్ జరిగే అవకాశాలు చాలా తక్కువనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.
Also Read: Watch Video: ఒంటి చేత్తో భారీ సిక్స్ బాదిన చెన్నై సారథి ధోని.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో