Lords Test : లార్డ్స్ టెస్ట్‌లో భారత్, ఇంగ్లాండ్ భారీ తప్పిదం.. డబ్బు, పాయింట్లు రెండూ ఖతం
లార్డ్స్ టెస్ట్‌లో స్లో-ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు డబ్ల్యూటీసీ పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పొరపాటు వల్ల ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా పడుతుంది. ఈ నియమాల గురించి, గతంలో జరిగిన సంఘటనల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

Lords Test : లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు చేసిన ఒక పొరపాటు వల్ల వారికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మ్యాచ్‌లో ఆలస్యంగా ఓవర్లు వేయడం (స్లో-ఓవర్ రేట్) వల్ల, రెండు జట్ల కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, బెన్ స్టోక్స్‌కు జరిమానా పడవచ్చు. అంతేకాకుండా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా వారి పాయింట్లు తగ్గవచ్చు.లార్డ్స్ టెస్ట్‌లో మూడు రోజుల పాటు ఆట ఆలస్యంగా ముగిసింది. మొదటి రోజు భారత్ కేవలం 83 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగింది. రెండో రోజు 75 ఓవర్లు, మూడో రోజు కేవలం 77 ఓవర్లు మాత్రమే వేశారు. నిర్ణీత సమయానికి వేయాల్సిన ఓవర్ల కంటే ఈ సంఖ్య చాలా తక్కువ.
డబ్ల్యూటీసీ పాయింట్లు తగ్గుతాయా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నియమాల ప్రకారం, స్లో-ఓవర్ రేట్ వల్ల జట్టు పాయింట్లలో కోత విధిస్తారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. 2023 యాషెస్ సిరీస్‌లో స్లో-ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియాకు 10 పాయింట్లు, ఇంగ్లాండ్‌కు 19 పాయింట్ల జరిమానా విధించారు. మొత్తం మీద, గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లాండ్‌పై 22 పాయింట్ల పెనాల్టీ పడింది.
ప్రస్తుత నియమం ప్రకారం.. ఒక జట్టు నిర్ణీత సమయానికి ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే, అన్ని పాయింట్లు కోల్పోతుంది. లార్డ్స్ టెస్ట్ మొదటి రోజు భారత జట్టు 7 ఓవర్లు తక్కువ వేసింది. అలాగే, ఇంగ్లాండ్ కూడా రెండు రోజులు తక్కువ ఓవర్లు వేసింది.
ఆటగాళ్లకు భారీ నష్టం జట్ల పాయింట్లతో పాటు, ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా పడుతుంది. ఐసీసీ నియమాల ప్రకారం, ఒక జట్టు రోజుకు ఎన్ని ఓవర్లు తక్కువ వేస్తే, ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. దీనివల్ల ఆటగాళ్లకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుంది.




