AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్..

ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్ రిజర్వ్ డే రోజున కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 356 పరుగులు సాధించింది. దీంతో పాకిస్తాన్ ముందు 357 పరుగుల టార్గెట్ నిలిచింది.

IND vs PAK: సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, రాహుల్.. పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్..
Virat Kohli Kl Rahul
Venkata Chari
|

Updated on: Sep 11, 2023 | 6:50 PM

Share

ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రిజర్వ్‌ డేలో భారత జట్టు 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు మిర్పూర్ మైదానంలో పాకిస్థాన్‌పై భారత్ 330 పరుగులు సాధించింది. అలాగే పాకిస్థాన్‌పై వన్డేల్లో భారత్ తన అత్యధిక స్కోరును సమం చేసింది. 2005లో విశాఖపట్నంలో పాకిస్థాన్‌పై టీమిండియా 356/9 పరుగులు చేసింది.

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. అంతకుముందు 2012లో మిర్పూర్ గడ్డపై భారత్ 330 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 183 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తరపున విరాట్ కోహ్లి 122, కేఎల్ రాహుల్ 111 నాటౌట్‌గా నిలిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ (56 పరుగులు), శుభమన్ గిల్ (58 పరుగులు) అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడారు.

రాహుల్ 100వ బంతికి సెంచరీ..

పాకిస్థాన్ పై కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. రెండున్నరేళ్ల తర్వాత వన్డే క్రికెట్‌లో తన బ్యాట్‌తో సెంచరీ సాధించాడు. రాహుల్ చివరిసారిగా 2021 మార్చి 26న ఇంగ్లండ్‌పై 108 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా పాకిస్థాన్‌పై తొలిసారి సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలపై ఒక్కో సెంచరీ సాధించాడు.

కోహ్లి-రాహుల్ జోడీ కళ్లుచెదిరే ఇన్నింగ్స్..

విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 233 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ స్కోర్ 121 పరుగుల వద్ద ఔట్ కాగా, 123 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..