
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ పోరు భారత అభిమానులు ఊహించిన విధంగానే ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో టీమిండియాను విజేతగా నిలిపాడు. కాగా ఈ మ్యాచ్ తర్వాత నెటిజన్లు ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్ ను ఏకిపారేస్తున్నారు. మహా కుంభమేళాతో ఫేమస్ అయిన ఈ బాబా మ్యాచ్ కు ముందు ఒక ఇంటర్వ్యూలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై జోస్యం చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విఫలమవుతాడని ప్రిడిక్షన్ చెప్పాడు. కానీ కొన్ని గంటల్లోనే బాబా జోస్యం తప్పని తేలిపోయింది. బాబా అంచనాలకు విరుద్ధంగా టీం ఇండియా పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో నెటిజన్లకు టార్గెట్ గా మారాడు ఈ ఐఐటీ బాబా. సోషల్ మీడియా వేదికగా అతనిని ఏకిపారేస్తున్నారు. ‘భారత్ ఓడిపోతుందన్న ఐఐటీ బాబా ఎక్కడ?’ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఇలా జాతకాలు, జోస్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మరి తన అంచనాలు తప్పడంపై ఐఐటీ బాబా ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున సౌద్ షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారత్ కేవలం 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను గెలిచింది. టీమిండియా తరపున కింగ్ కోహ్లీ 111 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా 56 పరుగులు సాధించాడు. సెంచరీతో భారత్ ను విజేతగా నిలిపిన కింగ్ కోహ్లీకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం ( ఫిబ్రవరి 24న) న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ A లో జరిగే ఈ మ్యాచ్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులతో పాటు పాకిస్తాన్ ప్రజలు కూడా అంతే ఆసక్తితో చూస్తారు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఫలితంపైనే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..