IND Vs SL: జైస్వాల్, ఫెర్నాండోల తరవాత మరో లంక క్రికెటర్‌పై ఐసీసీ వేటు.. అసలేం జరిగింది?
IND vs SL: కొలంబో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. మానవ్ సుతార్ బౌలింగ్‌లో రెండు పరుగులకే ఔటైన అనంతరం కోపంతో బౌండరీ లైన్ వెడ్జెస్‌ను బ్యాట్‌తో కొట్టినందుకు ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.2 కింద మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. ఇది 24 నెలల్లో అతని తొలి తప్పిదం.

IND Vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి మ్యాచులోనూ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే యశస్వి జైస్వాల్, అసిథ ఫెర్నాండోలకు జరిమానా విధించిన ఐసీసీ, తాజాగా శ్రీలంక స్టార్ స్పిన్నర్ ప్రబాత్ జయసూర్యపై కూడా చర్యలు తీసుకుంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రబాత్ జయసూర్య కేవలం రెండు పరుగులకే నిరాశగా పెవీలియన్ బాటపట్టాడు. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్‌లో రోజు ఆట ముగిసే చివరి బంతికి ఔట్ కావడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో తీవ్ర కోపంతో తన వద్ద ఉన్న బ్యాట్‌తో బౌండరీ లైన్ వెడ్జెస్‌ను గట్టిగా బాదాడు. స్టేడియంలో ఉన్న వస్తువులను ధ్వంసం చేసే విధంగా ప్రవర్తించడం ఐసీసీ నిబంధనల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
ఆర్టికల్ 2.2 కింద ఐసీసీ శిక్ష ఖరారు
జయసూర్య ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతనికి హెచ్చరిక జారీ చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.2 ప్రకారం మైదానంలోని వస్తువులను లేదా సామగ్రిని కొట్టడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. ఈ క్రమంలోనే అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. గత 24 నెలల కాలంలో జయసూర్య చేసిన మొదటి తప్పు కావడంతో ఐసీసీ కేవలం మందలింపు, డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టింది.
తొలి రోజు నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు నుంచి ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. తొలి రోజు ఆటలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక వేగవంతమైన బౌలర్ అసిథ ఫెర్నాండో పరస్పరం దుర్భాషలాడుకుంటూ వివాదానికి దిగారు. మ్యాచ్ రిఫరీ ఆ సంఘటనపై సీరియస్ అయి ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఆ సంఘటన మరవక ముందే మూడో రోజు ఆటలో లంక స్పిన్నర్ జయసూర్య కూడా అదే తరహాలో క్రమశిక్షణ తప్పడం చర్చనీయాంశంగా మారింది.
రెండో టెస్టులో శ్రీలంక పోరాటం
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు సాధించగా, శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. పసిందు సూరియబండార 80 పరుగులతో రాణించగా, సోనాల్ దినుషా 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లంకను ఆదుకున్నాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో మూడు వికెట్లు తీసి లంకను తీవ్రంగా దెబ్బతీశారు. వర్షం కారణంగా మూడో రోజు ఆట త్వరగానే ముగిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
