Harmanpreet Kaur : త్యాగాలు చేసిన వారికే గౌరవం.. ప్రపంచకప్ విజయం తర్వాత హర్మన్‌ప్రీత్ ఎమోషనల్ కామెంట్స్!
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన తర్వాత, జట్టు సభ్యులు దిగ్గజ మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు ట్రోఫీని అందించి అద్భుతంగా వేడుక చేసుకున్నారు.

Harmanpreet Kaur : నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన తర్వాత, జట్టు సభ్యులు దిగ్గజ మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిలకు ట్రోఫీని అందించి అద్భుతంగా వేడుక చేసుకున్నారు. ఈ భావోద్వేగ ఘట్టంపై భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటిసారిగా స్పందించారు.
నవంబర్ 2 న డీవై పాటిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగియగానే, దీప్తి శర్మ బౌలింగ్‌లో నాడిన్ డి క్లెర్క్ క్యాచ్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకోగానే, భారత మహిళల జట్టు చారిత్రక విజయం నమోదు చేసింది. భారత్ తొలిసారిగా ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో స్టేడియం మొత్తం అభిమానుల జయధ్వానాలతో దద్దరిల్లిపోయింది.
ట్రోఫీని అందుకున్న వెంటనే, హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టు తమ విజయాన్ని వారికి ముందు వచ్చిన, భారత మహిళా క్రికెట్ కోసం ఎంతో కృషి చేసిన మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా వంటి మాజీ ఆటగాళ్లకు అంకితం చేసింది. ఈ గౌరవ సన్మానం గురించి హర్మన్‌ప్రీత్ కౌర్ మొదటిసారిగా ఐసీసీ రివ్యూ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు. ఈ చర్య వెనుక గల ఉద్దేశాన్ని ఆమె వివరించారు.
“గతంలో కష్టపడి, పోరాడిన వారందరినీ మేము కేవలం గౌరవించాలని అనుకున్నాము. అనేక కష్టాలను ఎదుర్కొని, మహిళల క్రికెట్‌ను ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన వారిని మేము గుర్తించాలనుకున్నాము.” అని హర్మన్‌ప్రీత్ తెలిపారు. అంతకుముందు ప్రపంచకప్‌లో ఓడిపోయినప్పుడు తాము చాలా బాధపడ్డామని, ముఖ్యంగా అది ఝులన్ దీ, మిథాలీ దీలకు చివరి ప్రపంచకప్ కావడంతో వారి కోసం గెలవలేకపోయామని తానూ, స్మృతి మంధాన కూర్చుని చర్చించుకున్నట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.
భవిష్యత్తులో ప్రపంచకప్ గెలిస్తే, ఆ క్షణాన్ని మాజీ ఆటగాళ్లతో పంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించారు. “మేము భవిష్యత్తులో గెలిస్తే, వారు తప్పనిసరిగా స్టేడియంలో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాము. వారి ముందు ఆ ట్రోఫీ క్షణాన్ని మేము బంధించాలని నిజంగా కోరుకున్నాము. అది మాకు చాలా చాలా ప్రత్యేకమైన క్షణం” అని హర్మన్‌ప్రీత్ చెప్పారు. ఆ సమయంలో అక్కడ మిథాలీ, ఝులన్ సహా అందరూ ఉండటం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, వారి లేకుండా ఈ విజయ క్షణాన్ని తాము అస్సలు ఊహించుకోలేదని హర్మన్‌ప్రీత్ కౌర్ ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




