Smriti Mandhana : స్మృతి మంధానకు డబుల్ షాక్..ఆగిపోయిన పెళ్లి.. మొదట తండ్రి ఆ తర్వాత కాబోయే భర్తకు అస్వస్థత
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానకు ఆదివారం (నవంబర్ 23) తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు కావాల్సింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను ఆమె ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ శుభకార్యం అనుకోని సంఘటనలతో ఆగిపోయింది.

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానకు ఆదివారం (నవంబర్ 23) తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు కావాల్సింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను ఆమె ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ శుభకార్యం అనుకోని సంఘటనలతో ఆగిపోయింది. అదే రోజు ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానకు గుండెపోటు రావడంతో, కుటుంబ నిర్ణయం మేరకు ఆమె పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఒకే రోజున తండ్రికి గుండెపోటు, ఆ తర్వాత కాబోయే భర్త అస్వస్థతకు గురవడంతో స్మృతి మంధాన తీవ్ర ఆందోళన చెందారు.
గుండెపోటుతో అస్వస్థతకు గురైన శ్రీనివాస్ మంధానను వెంటనే సాంగ్లీలోని సర్వహిత్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చెందిన డాక్టర్ నమన్ షా మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఛాతీలో ఎడమ వైపు నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చారని, పరీక్షల అనంతరం అది గుండెపోటుగా నిర్ధారించినట్లు తెలిపారు. అప్పటి నుంచి కార్డియాలజిస్ట్ బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని, శ్రీనివాస్ మంధాన పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని డాక్టర్ షా తెలిపారు. పెళ్లి హడావిడిలో ఉన్న పరుగు, శారీరక అలసట లేదా మానసిక ఒత్తిడి కారణంగానే ఆయనకు ఈ గుండెపోటు వచ్చి ఉండవచ్చని డాక్టర్ల అభిప్రాయం.
ఒకవైపు తండ్రి ఆస్పత్రిలో ఉండగా కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులందరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పలాష్‌కు వైరల్ ఇన్‌ఫెక్షన్, ఎసిడిటీ సమస్య తలెత్తింది. దాంతో ఎలాంటి అపాయం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఆయనను కూడా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పలాష్ పరిస్థితి ప్రమాదకరంగా ఏం లేదు. డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని తేలింది. కొద్దిసేపటికే ఆయనను డిశ్చార్జ్ చేసి హోటల్‌కు పంపించారు. ప్రస్తుతం పలాష్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది.
ఒకే రోజున రెండు అనూహ్య సంఘటనలు జరగడం, ముఖ్యంగా తండ్రి గుండెపోటు కారణంగా, పెళ్లి వేడుకను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం స్మృతి మంధాన కుటుంబం తండ్రి ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది. పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత కొత్త వివాహ తేదీని ప్రకటించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. దేశంలోని స్టార్ క్రికెటర్‌గా ఉన్న స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ ఆందోళనకరమైన పరిణామం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ, ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
