MS Dhoni: ధోని జెర్సీకి రిటైర్మెంట్ ఇవ్వాలి.. ఇతర ఆటగాళ్లు వాడకుండా చూడాలి: మాజీ క్రికెటర్ సాబా కరీం
మహేంద్ర సింగ్ ధోనీతో సహా దేశంలోని ఇతర గొప్ప ఆటగాళ్ల జెర్సీలకు భారత బోర్డు వీడ్కోలు పలకాలని భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలెక్టర్ సాబా కరీం అన్నారు.
Indian Cricket Team: మహేంద్ర సింగ్ ధోనీతో సహా దేశంలోని ఇతర గొప్ప ఆటగాళ్ల జెర్సీలకు భారత బోర్డు వీడ్కోలు పలకాలని భారత మాజీ వికెట్ కీపర్, మాజీ సెలెక్టర్ సాబా కరీం అన్నారు. ఈమేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) కు సలహా ఇచ్చారు. మాజీ క్రీడాకారులు దేశానికి అద్భుతమైన కృషి చేసినందున వారిని గౌరవించే ఉద్దేశంతో బోర్డు ఇలాంటి చర్యలు తీసుకోవాలని కరీం కోరారు. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా ధోనీ పేరుగాంచాడని, టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన ఏకైక కెప్టెన్ ధోని అని వెల్లడించాడు. అతని కెప్టెన్సీలో, భారత్ 2007 లో టీ20 ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ టైటిల్‌ను సాధించింది. నాలుగు సంవత్సరాల తరువాత అంటే 2011 లో వన్డే ప్రపంచ కప్ ను సాధించాడు. అనంతరం 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని పేర్కొన్నాడు. జులై 7 న ఈ మాజీ కెప్టెన్ తన 40 వ పుట్టినరోజు నిర్వహించుకున్నాడు. ఆయనతో పాటు సౌరవ్ గంగూలీ జులై 8 న తన బర్త్‌డే చేసుకున్నారు. గంగూలీ కూడా దేశంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచాడు.
‘గొప్ప ఆటగాళ్ల జెర్సీని మరే ఆటగాడు ధరించకుండా బోర్డు వాటిని భద్రపరచాలని కరీం కోరాడు. వారు ధరించిన జెర్సీ నంబర్లను ఇతర ఆటగాళ్లు వాడకుండా చూడాలి. భారత క్రికెట్‌కు గుర్తింపు తెచ్చిన దిగ్గజ ఆటగాళ్లకు ఇదో గుర్తింపు లాంటిదని, వారిని ఇలా గౌరవించొచ్చు’ అని ఆయన పేర్కొన్నాడు. ‘ధోని భారత క్రికెట్‌కు సేవలు అందిస్తాడనే నేను అనుకుంటున్నా. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడెంతో మంది ప్లేయర్లను తయారు చేశాడు. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయాలని’ అన్నాడు.
Also Read:
Tokyo Olympics 2021: జులై 13న అథ్లెట్లతో ప్రధాని మోడీ మీటింగ్..! టోక్యో బయలుదేరనున్న ప్లేయర్స్