Video: అక్కడ బ్యాటైనా.. ఇక్కడ రాకెటైనా.. ఐపీఎల్‌కు ముందే ‘వార్నింగ్’ ఇచ్చిపడేసిన ధోని..!
Ms Dhoni Plays Tennis Tournament in Ranchi: ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా కొన్ని నెలలే సమయం ఉంది. ఈ సీజన్ కోసం ఎంఎస్ ధోని తిరిగి వస్తున్నాడని అభిమానులు సంతోషిస్తున్నారు. అంతేకాకుండా, టెన్నిస్ కోర్టులో తన పరాక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా ధోని తన ఫిట్‌నెస్ గురించి ఉన్న సందేహాలను కూడా తొలగించాడు.

Ms Dhoni Plays Tennis Tournament in Ranchi: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. ధోనీ ఈ సీజన్‌లో ఆడనుండటంతో అభిమానులు ఇప్పటికే ఆనందంలో ఉన్నారు. అంతేకాకుండా, తన ఫిట్‌నెస్ గురించి వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, టెన్నిస్ కోర్టులో తన సత్తా చాటారు.
ఐపీఎల్ 2026 కోసం 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. ఇందులో అభిమానులకు అతిపెద్ద ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లో ఆడనుండటం. గత 2-3 సీజన్లుగా ధోనీ ఫిట్‌నెస్, రిటైర్మెంట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నా, ప్రతిసారీ ఆయన పూర్తి ఫిట్‌నెస్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు కూడా కొత్త సీజన్‌కు తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో టెన్నిస్ కోర్టులో ఒక చిన్న ప్రదర్శన ద్వారా నిరూపించారు. రాంచీలో జరిగిన ఒక టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ధోనీ, అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన స్నేహితుడితో కలిసి కప్ గెలుచుకున్నారు.
టెన్నిస్ రాకెట్‌తోనూ అదే జోరు..
క్రికెట్ మైదానంలో తన బ్యాట్‌తో భారీ సిక్సర్లు కొట్టే ధోనీ, టెన్నిస్ రాకెట్‌తోనూ అద్భుతాలు చేయగలనని నిరూపించారు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ధోనీ తన టెన్నిస్ నైపుణ్యాలను ప్రదర్శించారు. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోనీ, కేవలం పోటీలో పాల్గొనడమే కాకుండా, ఇతర ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు కూడా అందజేశారు.
MS Dhoni playing tennis in JSCA Stadium 💛#MSDhoni #Dhoni @msdhoni pic.twitter.com/rVoY9db5qr
— Dhoni Raina Team (@DhoniRainaTeam) November 19, 2025
ఈ టోర్నమెంట్‌లో ధోనీ తన స్నేహితుడు సుమిత్ బజాజ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడ్డారు. తనదైన ఛాంపియన్ స్టైల్‌లో ఆడుతూ ఫైనల్‌కు చేరుకుని విజయం సాధించారు. ధోనీ దాదాపు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటారు, కొన్నిసార్లు విజేతగా కూడా నిలిచారు.
రాంచీ వీధుల్లో తన బైక్, కారులో వెళ్తున్నప్పుడు, లేదా స్టేడియంకు వచ్చినప్పుడు ధోనీని చూడటానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి ఆయన టెన్నిస్ కోర్టులో కనిపించడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపయ్యింది. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ చూపిన చురుకుదనం అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఆటగాళ్లు కూడా ధోనీతో కలిసి ఆడటానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. మ్యాచ్ అనంతరం స్టేడియం జిమ్‌లో ధోనీ కాసేపు కసరత్తులు కూడా చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




