AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gambhir: ఏరికోరి హెడ్ కోచ్ గా పెట్టుకున్నారు.. కట్ చేస్తే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాడు..

భారత క్రికెట్ జట్టులో గౌతమ్ గంభీర్, సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు తీవ్రతరం అయ్యాయి. బీసీసీఐ ఇప్పటికే జట్టు ప్రదర్శనపై సమీక్ష చేపట్టింది. గంభీర్, కొంతమంది స్టార్ ఆటగాళ్లు ప్రత్యేక డిమాండ్లపై అభ్యంతరం వ్యక్తం చేయగా, సీనియర్లు అతని కమ్యూనికేషన్ పద్ధతిపై అసంతృప్తి తెలిపారు. గంభీర్ ధోరణిని గ్రేగ్ ఛాపెల్‌తో పోలుస్తూ, దానిని భారత్‌కు అనుకూలం కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదాలు టీమ్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అసహజంగా మార్చాయి.

Gambhir: ఏరికోరి హెడ్ కోచ్ గా పెట్టుకున్నారు.. కట్ చేస్తే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాడు..
Gambhir
Narsimha
|

Updated on: Jan 15, 2025 | 9:38 AM

Share

భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం విభేదాలు నడుస్తున్నాయి. టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ టీమ్ కల్చర్ విషయంలో సీనియర్ ఆటగాళ్లతో ఒకే పేజీలో లేరని సమాచారం. ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు ప్రదర్శనపై బీసీసీఐ ఇప్పటికే సమీక్ష నిర్వహించింది. అయితే, గంభీర్, సీనియర్ ఆటగాళ్ల మధ్య జట్టు కల్చర్, పద్ధతుల విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, కొంతమంది స్టార్ ఆటగాళ్లు హోటళ్ల ఎంపిక, ప్రాక్టీస్ సమయాల విషయంలో ప్రత్యేక డిమాండ్లు చేయడం కోచ్‌కు ఇష్టం లేని విషయం.

అటువైపు సీనియర్ ఆటగాళ్లు కోచ్ నుంచి సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా, జాతీయ సెలక్షన్ కమిటీ గంభీర్‌కు సెలక్షన్ పై అధిక హస్తం ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గంభీర్ ధోరణి ప్రముఖ ఆస్ట్రేలియన్ కోచ్ గ్రేగ్ ఛాపెల్‌ను గుర్తు చేస్తోందని మాజీ సెలెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. గ్రేగ్ ఛాపెల్ భారత జట్టుకు కోచ్‌గా ఉన్నప్పుడు తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలు పెద్ద వివాదాలకే దారితీశాయి.

మరోవైపు, “గంభీర్ ఒక రవిశాస్త్రిలా మీడియా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. లేదంటే రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్స్టెన్ లేదా జాన్ రైట్‌లా కూల్‌గా, దూరంగా ఉండి ఆటగాళ్లకు వేదిక ఇవ్వాలి. కానీ ‘చాపెల్ విధానం’ భారత్‌లో పనిచేయదు” అని ఆ సెలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ వివాదంలో మరింత చర్చకు దారితీసిన విషయం గంభీర్ వ్యక్తిగత సహాయకుడు. అతను ఆస్ట్రేలియాలో జట్టును ప్రతిచోటా అనుసరించాడని సమాచారం. “ఆ వ్యక్తి సెలెక్టర్ల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కారులో ఎందుకు కూర్చున్నాడు? వారికి ప్రైవేటుగా చర్చలు జరపడానికి వీలులేకుండా చేశాడు. అతనికి అడిలైడ్‌లో బీసీసీఐ హాస్పిటాలిటీ బాక్స్‌లో స్థానం ఎలా దక్కింది?” అని బీసీసీఐ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే, టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా కేటాయించిన ఫైవ్ స్టార్ హోటల్ ప్రాంతంలో అతను బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేశాడు? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి అసహజంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.