T20 World Cup: అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ టీమ్.. క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైమ్
ఇంగ్లండ్ టీమ్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ఉంటూనే టీ20 వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. క్రికెట్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ ఇలా జరగడం ఇదే మొదటిసారి. 30ఏళ్ల కిందటి ఓటమికి బదులు తీర్చుకుని ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది ఇంగ్లండ్.
1992లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్ ఇది. సెమీస్‌లో కివీస్‌పై నెగ్గిన పాక్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడింది. ఇంగ్లీష్ టీమ్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది పాకిస్తాన్. మళ్లీ అదే తరహాలో.. అదే మెల్‌బోర్న్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇరుజట్లు తలపడ్డాయి. కప్ మాదేనని పాక్ ఆటగాళ్లు, అభిమానులు కలలగన్నారు. కానీ సీన్ రివర్సయింది. ఎక్కడ పోయిందో.. అక్కడే ఒడిసిపట్టుకుంది ఇంగ్లండ్. కాకపోతే కప్ సాకారానికి 30ఏళ్లు పట్టింది. ఇంగ్లండ్‌ను క్రికెట్ పుట్టినిల్లుగా చెప్పుకుంటాం. అలాంటి జట్టు వరల్డ్ కప్‌ను గెలిచేందుకు అపసోపాలు పడింది. 2019లో వన్డే వరల్డ్ కప్.. 2022లో టీ 20 వరల్డ్‌కప్‌ను సాధించి అందరి మనసులు గెలిచింది. ఓటమి నుంచే గెలుపు ప్రయాణం మొదలవుతుందని.. పరాభవమే గొప్ప పాఠాలు నేర్పుతుందనడానికి ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ఓ నిదర్శనం. ఒక్క ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. ఆ జట్టు దృక్పథాన్నే మార్చింది. ఆడే విధానంలో.. ఆలోచనలో మార్పు తెచ్చింది. దూకుడు నేర్చిన జట్టు ప్రత్యర్థులపై కసిగా విరుచుకుపడడం ఆరంభించింది. భయంలేని ఆటతో.. బలమైన జట్టుతో అద్భుతాలు చేస్తోంది. అందుకే.. మూడేళ్ల వ్యవధిలో రెండు ప్రపంచకప్‌లు గెలిచింది.
టీ20 ప్రపంచకప్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు అరుదైన ఫీట్ సాధించింది. వన్డేల్లో ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇప్పటికే 2019లో వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలి ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ ముద్దాడింది. 2023లో వన్డే ప్రపంచకప్ ముగిసేంత వరకు.. 2024 నాటి టీ20 వరల్డ్‌కప్ సమరం పూర్తయ్యేవరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఛాంపియన్ హోదాలో ఉండనుంది ఇంగ్లండ్.
ఓవరాల్‌గా ఇంగ్లండ్ ఖాతాలో మొత్తం మూడు ఐసీసీ వరల్డ్‌కప్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే రెండు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన రెండో జట్టుగా ఇంగ్లండ్ అవతరించింది. అంతకుముందు వెస్టిండీస్ 2012, 2016లో విశ్వ విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఇంగ్లండ్.. వరుసగా టైటిల్ విజేతగా నిలవడం ఆ దేశ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం