AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Records : క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. రెండు బంతుల్లో రెండు క్యాచ్‌లు పట్టినా.. ఆ బ్యాటర్ నాటౌట్

Cricket Records : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఒకే బ్యాటర్.. వరుసగా రెండు బంతుల్లో రెండుసార్లు క్యాచ్ ఇచ్చాడు. ఫీల్డర్లు ఆ క్యాచ్‌లను పట్టుకున్నారు కూడా. కానీ ఆ బ్యాటర్ మాత్రం అవుట్ అవ్వలేదు.

Cricket Records : క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. రెండు బంతుల్లో రెండు క్యాచ్‌లు పట్టినా.. ఆ బ్యాటర్ నాటౌట్
Sherfane Rutherford
Rakesh
|

Updated on: Apr 13, 2026 | 6:38 AM

Share

Cricket Records : ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన పోరులో బ్యాటర్లు శివాలెత్తారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ ఏకంగా 240 పరుగుల కొండంత లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ముంబై కూడా పట్టువదలకుండా పోరాడింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం, బుమ్రా వరుసగా 5వ మ్యాచ్‌లోనూ వికెట్ తీయలేకపోవడం చర్చనీయాంశమయ్యాయి. కానీ, అన్నిటికంటే హైలైట్ మాత్రం ముంబై ఇంపాక్ట్ ప్లేయర్ షెర్ఫేన్ రుథర్‌ఫోర్డ్‌కు ఎదురైన వింత అనుభవం.

ఆ 16వ ఓవర్లో ఏం జరిగింది?

ముంబై ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అసలైన డ్రామా మొదలైంది. ఆర్‌సీబీ బౌలర్ రసిఖ్ సలామ్ 5 బంతులు వేసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. మిగిలిన ఒక్క బంతిని వేయడానికి రోమారియో షెపర్డ్ వచ్చాడు. షెపర్డ్ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని రుథర్‌ఫోర్డ్ గాల్లోకి లేపాడు. షెపర్డ్ స్వయంగా పరిగెత్తుకెళ్లి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆర్‌సీబీ సంబరాలు మొదలుపెట్టేలోపే అంపైర్ షాక్ ఇచ్చాడు. అది నో బాల్ అని ప్రకటించడంతో రుథర్‌ఫోర్డ్ నాటౌట్‌గా మిగిలాడు.

రెండో బంతికీ అదే సీన్

తర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో రుథర్‌ఫోర్డ్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. ఈసారి కూడా బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతికి చిక్కింది. అంటే వరుసగా రెండు బంతుల్లో రెండు క్యాచ్‌లు వచ్చాయి. కానీ, ఫ్రీ హిట్ నిబంధన ప్రకారం రన్ అవుట్ మినహా వేరే ఏ విధంగానూ అవుట్ అయ్యే అవకాశం లేదు. దీంతో క్యాచ్ పట్టినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇలా ఒకే బ్యాటర్ రెండు బంతుల్లో రెండుసార్లు క్యాచ్ ఇచ్చినా క్రీజులో పాతుకుపోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన దృశ్యంగా నిలిచింది.

విరుచుకుపడ్డ రుథర్‌ఫోర్డ్

ఈ రెండు లైఫ్ లతో రెచ్చిపోయిన రుథర్‌ఫోర్డ్ ఆర్‌సీబీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 31 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 71 పరుగులు చేశాడు. ముంబై ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, రుథర్‌ఫోర్డ్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్ల ముంబై నెట్ రన్ రేట్ భారీగా పడిపోకుండా కాపాడింది. అదృష్టం కలిసిరావడం అంటే ఇదే అని క్రికెట్ విశ్లేషకులు ఈ ఘటనను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us