IND vs PAK : మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా? సూర్య సేన ఆ శాపాన్ని చెరిపివేస్తుందా?
IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించి, సగర్వంగా సూపర్-8 లోకి అడుగుపెట్టింది. చిరకాల ప్రత్యర్థిపై 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి.

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ పోరులో టీమిండియా ఘనవిజయం సాధించి, సగర్వంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. చిరకాల ప్రత్యర్థిపై 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. అయితే, ఈ ఆనందం వెనుక ఒక వింత సెంటిమెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గత చరిత్రను పరిశీలిస్తే, పాక్‌పై ఇలాంటి పర్వదినాల్లో లేదా ప్రత్యేక తేదీల్లో భారీ విజయాలు సాధించిన ప్రతిసారీ భారత్‌కు ప్రపంచకప్ ట్రోఫీ తృటిలో చేజారింది. మరి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ కొత్త భారత్ ఆ పాత శాపాన్ని చెరిపివేస్తుందా? అసలు ఆ భయపెట్టే లెక్కలేంటో చూద్దాం.
ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లను ఉతికి ఆరదీయగా, ఆ తర్వాత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 114 పరుగులకే పాక్ కుప్పకూలడంతో భారత్ 61 పరుగుల రికార్డు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శన చూసి భారత్ కచ్చితంగా కప్పు కొడుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కానీ, ఈ గెలుపు వచ్చిన తేదీ, సందర్భం పాత చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి.
భారత జట్టుకు, ఫిబ్రవరి 15వ తేదీకి ఒక విచిత్రమైన సంబంధం ఉంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, అంటే 2015 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. ఆ రోజు కూడా టీమిండియా పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. కానీ, ఆ టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకున్నాక ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి కప్పు లేకుండానే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే తేదీన పాక్ పై విజయం సాధించడంతో, ఈసారి కూడా కథ అలాగే ముగుస్తుందా అని అభిమానులు కలవరపడుతున్నారు.
తేదీతో పాటు ఈసారి పండుగ సెంటిమెంట్ కూడా తోడవ్వడం గమనార్హం. నిన్న మ్యాచ్ జరిగిన రోజు దేశమంతా మహాశివరాత్రి వేడుకల్లో ఉంది. దీనికి 23 ఏళ్ల క్రితం జరిగిన 2003 ప్రపంచకప్‌తో పోలిక ఉంది. అప్పుడు కూడా భారత్-పాక్ పోరు సరిగ్గా శివరాత్రి రోజే జరిగింది. గంగూలీ కెప్టెన్సీలో భారత్ ఆ మ్యాచ్ గెలిచినా, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా మిగిలిపోయింది. అంటే, శివరాత్రి నాడు పాక్‌ను ఓడించినా ట్రోఫీ మాత్రం దక్కలేదనే సెంటిమెంట్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులను వేధిస్తోంది.
చరిత్రను మార్చడమే ఛాంపియన్ల లక్ష్యం. గతంలో 2003, 2015లలో భారత్ ఆశలను ఆస్ట్రేలియా గండికొట్టింది. అయితే ప్రస్తుత భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ వంటి డైనమిక్ కెప్టెన్, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లు, బుమ్రా వంటి మేటి బౌలర్లు ఉన్నారు. సెంటిమెంట్లు అనేవి కేవలం అంకెలే అని, మైదానంలో చూపే ప్రతిభే ముఖ్యం అని టీమిండియా భావిస్తోంది. చరిత్ర పునరావృతం కాకుండా, ఆ పాత రికార్డులను తుడిచిపెట్టి ఈసారి ట్రోఫీని ముద్దాడాలని సూర్య సేన పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ గండం దాటిన భారత్, సూపర్-8లోనూ ఇదే జోరు చూపిస్తే సెంటిమెంట్లన్నీ పటాపంచలు కావడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
