On This Day: 155 ఫోర్లు, 16 సిక్సర్లతో 1415 పరుగులు.. 8గురి బౌలర్ల ఊచకోత.. 81 ఏళ్ల రికార్డు బ్రేక్
155 ఫోర్లు, 16 సిక్సర్లతో 1415 పరుగులు.. 2 డబుల్ సెంచరీలు, 1 శతకం.. మరో బ్యాటర్ 150 పరుగులు.. ఇదంతా కూడా...
155 ఫోర్లు, 16 సిక్సర్లతో 1415 పరుగులు.. 2 డబుల్ సెంచరీలు, 1 శతకం.. మరో బ్యాటర్ 150 పరుగులు.. ఇదంతా కూడా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న రికార్డులు. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం అంటే జనవరి 3వ తేదీ, 2016న బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో ఆరో వికెట్‌కు 399 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే ఆరో వికెట్‌కు టెస్టుల్లో అత్యధిక పార్టనర్‌షిప్.
గతంలో కేన్ విలియమ్సన్, బీజే వాట్లింగ్‌ల 365 పరుగుల రికార్డును స్టోక్స్, బెయిర్‌స్టో జోడీ బద్దలు కొట్టింది. ఇదే కాదు.. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. ఇంగ్లాండ్ తరఫున రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీని స్టోక్స్ బాదేశాడు. కేవలం 130 బంతుల్లోనే అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు ఈ టెస్టు మ్యాచ్ రెండో రోజున తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 81 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా కూడా ఈ టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.
ఒక మ్యాచ్‌లో 1415 పరుగులు..
కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ టెస్టులో మొత్తం 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు నమోదయ్యాయి. 5 రోజుల పాటు బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఫలితంగా ఒకే టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 1415 పరుగులు చేశాయి. ఇంగ్లాండ్ 6 వికెట్లకు 629 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌లో డిక్లేర్ చేయగా, దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 627 పరుగులు చేసి తన ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు వరకు 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఫలితం ఏమి రాకపోవడంతో ఈ మ్యాచ్ డ్రా అయింది.
ఆమ్లా-బావుమా జోరు..
ఈ మ్యాచ్‌లో స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఆమ్లా 201 పరుగులు చేయగా.. టెంబా బావుమా(102) సెంచరీతో అదరగొట్టాడు. దీంతో అతడు టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి బ్లాక్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.