Sachin: సచిన్ కంటే ముందే వన్డేల్లో డబుల్ సెంచరీ.. అది కూడా టీమిండియాపైనే.. ఆ ప్లేయర్ ఎవరంటే?
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు అందరూ కూడా ఠక్కున సచిన్ టెండూల్కర్ అని అంటారు..

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు ఎవరు? ఈ ప్రశ్నకు అందరూ కూడా ఠక్కున సచిన్ టెండూల్కర్ అని అంటారు. కానీ వాస్తవానికి వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే 13 సంవత్సరాల ముందే ఓ క్రికెటర్ ఈ ఫీట్ సాధించారు. ఇక ఆ ప్లేయర్ మరెవరో కాదు బెలిండా క్లార్క్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ మాజీ మహిళా క్రికెటర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆమె కాంస్య విగ్రహాన్ని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల ఆవిష్కరించారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ బెలిండా నిలిచింది. SCG వెలుపల కాంస్య విగ్రహం కలిగి ఉన్న 5వ ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిండా క్లార్క్. ఆమె కంటే ముందు రిచీ బెనాడ్, స్టీవ్ వా, స్టాన్ మెక్‌కేబ్, ఫ్రెడ్ స్పోఫోర్త్ లిస్టులో ఉన్నారు.
మరోవైపు బెలిండా క్లార్క్ ఆస్ట్రేలియా తరపున 14 ఏళ్ల పాటు క్రికెట్ ఆడింది. ఈ సమయంలో ఆమె 15 టెస్టులు, 118 వన్డేలు, 1 టీ20లో ప్రాతినిధ్యం వహించింది. ఇక ఇప్పటికీ ఆమె గురించి ప్రపంచ క్రికెట్‌లో చర్చించే విషయం డబుల్ సెంచరీ. 1997వ సంవత్సరం ముంబై వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ODI క్రికెట్ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీని నమోదు చేసింది. 229 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచింది. ఇది ఇప్పటికీ మహిళల క్రికెట్‌లో హయ్యస్ట్ స్కోర్.
కాగా, బెలిండా క్లార్క్ డబుల్ సెంచరీ అనంతరం 13 ఏళ్ల తర్వాత 2010లో సచిన్ టెండూల్కర్ గ్వాలియర్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇదే పురుషుల వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ. ఆమె తన క్రికెట్ కెరీర్ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్, ఐసీసీలలో పలు కీలక బాధ్యతలు చేపట్టింది. అలాగే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బెలిండా క్లార్క్ హర్షం వ్యక్తం చేసింది.

