BCCI vs PCB: ఇకనైనా పిల్ల చేష్టలు మానుకో.. పీసీబీ చీఫ్‌పై బీసీసీఐ ఫైర్.. ఐసీసీ చెంతకు ట్రోఫీ వివాదం
Team India: భారత జట్టు తమ పట్ల జరిగిన ఈ అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ట్రోఫీని నిరాకరించినా, దానిని తీసుకుపోవడం "పిల్ల చేష్ట"గా బీసీసీఐ అభివర్ణించింది. మొత్తానికి, ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ ఆట కంటే, దాని తర్వాత జరిగిన రాజకీయ, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ఈ ట్రోఫీ వివాదంతోనే ఎక్కువ వార్తల్లో నిలిచింది.

BCCI vs PCB: ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత జరిగిన ట్రోఫీ ప్రజంటేషన్ (బహుమతి ప్రదానోత్సవం) వివాదం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరకు చేరింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వ్యవహారశైలిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు ట్రోఫీ ఇవ్వకుండా నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వివాదానికి కారణం ఏంటి?
దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టీమ్ ఇండియా ఆసియా కప్‌ను గెలుచుకుంది. అయితే, బహుమతి ప్రదానోత్సవంలో పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. నఖ్వీ పాకిస్తాన్ అంతర్గత మంత్రి (Interior Minister) కూడా కావడంతో, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నుంచి ట్రోఫీని తీసుకోకూడదని భారత జట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, భారత జట్టు విన్నపాన్ని ఏసీసీ పట్టించుకోకపోవడంతో, టోర్నమెంట్ విజేతకు ట్రోఫీని అందజేయకుండానే బహుమతి ప్రదానోత్సవం ముగిసింది.
అంతేకాకుండా, మొహ్సిన్ నఖ్వీ విజేతల ట్రోఫీని తనతోపాటు తీసుకెళ్లి తన హోటల్ గదిలో పెట్టుకున్నారని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఆరోపించారు. ట్రోఫీ ఏసీసీ ఆస్తి అని, దానిని వ్యక్తిగతంగా తీసుకువెళ్లడం అత్యంత అసభ్యకరమైన, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన చర్య అని ఆయన ఖండించారు.
బీసీసీఐ చర్యలు..
ఈ మొత్తం సంఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మొహ్సిన్ నఖ్వీని ఈ విషయంపై గట్టిగా నిలదీశారు. ట్రోఫీని వెంటనే భారత జట్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నవంబర్ మొదటి వారంలో దుబాయ్‌లో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఏసీసీ ఛైర్మన్ చర్యపై తాము బలమైన, తీవ్రమైన నిరసన నమోదు చేస్తామని బీసీసీఐ కార్యదర్శి సైకియా ప్రకటించారు.
భారత జట్టు తమ పట్ల జరిగిన ఈ అవమానాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ట్రోఫీని నిరాకరించినా, దానిని తీసుకుపోవడం “పిల్ల చేష్ట”గా బీసీసీఐ అభివర్ణించింది. మొత్తానికి, ఆసియా కప్ ఫైనల్ క్రికెట్ ఆట కంటే, దాని తర్వాత జరిగిన రాజకీయ, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ఈ ట్రోఫీ వివాదంతోనే ఎక్కువ వార్తల్లో నిలిచింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




