ఐపీఎల్‌కు పోటీ అంటూ విర్రవీగారు.. కట్‌చేస్తే.. రూ. 40 కోట్ల నష్టాలతో ప్యాకప్ చెప్పేశారుగా..!
Bangladesh Premier League Suspended: రూ.40 కోట్ల భారీ నష్టాల కారణంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ ప్రకటించి షాకిచ్చాడు. దీంతో బీపీఎల్ లీగ్‌ను సరిదిద్దేందుకు 6 నుంచి 2 ఏళ్ల సమయం పట్టొచ్చంటూ చెప్పుకొచ్చాడు.

BPL Suspended: ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లు కాసుల వర్షం కురిపిస్తుంటే, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వరుస నష్టాలు, నిధుల సమస్యలతో సతమతమవుతున్న బీపీఎల్‌ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ గురువారం అధికారికంగా ప్రకటించి క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపారు.
రూ.40 కోట్ల నష్టం.. టోర్నీకి బోర్డు బ్రేక్..
మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో తమీమ్ ఇక్బాల్ లీగ్ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టతనిచ్చారు. సాధారణంగా బోర్డుకు ఆదాయం తెచ్చిపెట్టాల్సిన ఫ్రాంచైజీ టోర్నీ, రివర్స్‌లో భారీ నష్టాలను మిగల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. గత రెండేళ్ల కాలంలోనే బీసీబీకి దాదాపు 40 కోట్ల బంగ్లాదేశ్ టాకాల (భారత కరెన్సీలో సుమారు రూ.3.13 కోట్లు) మేర నష్టం వాటిల్లింది. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం, లాభాలు రాని టోర్నమెంట్‌ను ప్రతి ఏటా యాంత్రికంగా నిర్వహించడం వల్ల బోర్డుపై అనవసర భారం పడుతోందని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థాగత లోపాలు సరిదిద్దే వరకు లీగ్‌ను నిర్వహించబోమని తెగేసి చెప్పారు.
ఈ ఏడాది బీపీఎల్ లేనట్లే.. టైమ్‌లైన్‌పై సందిగ్ధత..
ఆర్థిక సంక్షోభం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ భవితవ్యంపై సందిగ్ధత కొనసాగనుంది. ఈ ఏడాది టోర్నీ నిర్వహణపై వస్తున్న వార్తలను తమీమ్ తోసిపుచ్చారు. సమస్యలను పరిష్కరించడానికి 6 నెలలు, ఏడాది లేదా రెండేళ్ల సమయం పట్టినా వేచిచూస్తామని, తొందరపడి టోర్నీని నిర్వహించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
ఫ్రాంచైజీలతో చర్చలు.. బ్యాంక్ గ్యారంటీలపై విచారణ..
లీగ్‌లో బకాయిలు పడ్డ ఫ్రాంచైజీలతో బోర్డు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయని వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, బ్యాంక్ గ్యారంటీల వ్యవహారాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. బీసీబీ లాభాల బాట పట్టే వరకు, పూర్తి స్థాయి ఆర్థిక స్పష్టత వచ్చే వరకు తదుపరి సీజన్ నిర్వహణ ఉండదని బోర్డు తేల్చిచెప్పింది.
ఎక్కువమంది చదివినది:SL vs IND: లంకపై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ దూకుడు.. ఆ జట్టు ఔట్..?
ఫ్రాంచైజీల వైఫల్యాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా బీపీఎల్ నిలిచిపోవడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురుదెబ్బే. నష్టాల్లో ఉన్న లీగ్‌ను ప్రక్షాళన చేసి లాభాల బాట పట్టించేందుకు బోర్డు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




