AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో టీమిండియా చేతిలో ఓటమికి.. వెంటనే కసితీరా బదులుతీర్చుకున్న ఆస్ట్రేలియన్స్‌!

ఇండియా మాస్టర్స్ vs ఆస్ట్రేలియా మాస్టర్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. షేన్ వాట్సన్ (110), బెన్ డంక్ (132) సెంచరీలు సాధించారు. సచిన్ టెండూల్కర్ 64 పరుగులతో చెలరేగినప్పటికీ, భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయ్యి 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో టీమిండియా చేతిలో ఓటమికి.. వెంటనే కసితీరా బదులుతీర్చుకున్న ఆస్ట్రేలియన్స్‌!
India Masters Vs Australia
SN Pasha
|

Updated on: Mar 06, 2025 | 10:50 AM

Share

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్తే.. ఆస్ట్రేలియా తట్టాబుట్టా సర్దుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. చాలా మంది భారత క్రికెట్‌ అభిమానులు టీమిండియా సాధించిన విజయాన్ని 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా భావించారు. టీమిండియా బదులుతీర్చుకుందని సంబురాలు జరుపుకున్నారు. అయితే టీమిండియా చేతిలో ఓటమి మాత్రం ఆస్ట్రేలియన్స్‌కు అస్సలు నచ్చలేదు. ఎంతో కీలకమైన టాస్ గెలిచి, మంచి టార్గెట్‌ సెట్‌ చేసి కూడా మ్యాచ్‌ ఓడిపోవడంతో కంగారుల జట్టు కసితో రగిలిపోయింది. ఆయితే టీమిండియా గెలిస్తే.. మనం గెలిచామని ఎలా సంబురాలు చేసుకున్నామో.. ఆస్ట్రేలియా ఓడితే ఆస్ట్రేలియన్స్‌ అంతా ఓడిపోయినట్టు వాళ్లు కూడా బాధపడ్డారు.

అయితే ఆ ఓటమికి ఎక్కువగా టైమ్‌ తీసుకోకుండా వెంటనే కసితీరా బదులు తీర్చుకున్నారు. అది కూడా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహిస్తున్న ఇండియా మాస్టర్స్‌ టీమ్‌పై. ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం వడోదరలోని బీసీఏ(బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌) స్టేడియంలో ఇండియా మాస్టర్స్‌, ఆస్ట్రేలియా మాస్టర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్లను చీల్చిచెండాడుతూ.. పరుగుల వరద పారించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌ కెప్టెన్‌ షేన్‌ వాట్సన్‌, వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌ డంక్‌ అయితే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. వాట్సన్‌ 52 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 110 పరుగులు, బెన్‌ డంక్‌ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సులతో 132 పరుగుల భారీ స్కోర్లు చేశారు. వీరి ధాటికి ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఏకంగా 269 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇండియా మాస్టర్స్‌ టీమ్‌లోని బౌలర్లు వినయ్‌ కుమార్‌, మిథున్‌, నేగి, రాహుల్‌ శర్మ, ఇర్ఫాన్‌ పఠాన్‌, బిన్ని, గుర్‌క్రీత్‌ సింగ్‌ ఇలా బౌలింగ్‌ వేసిన ప్రతి బౌలర్‌ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు.

ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో టీమిండియాలో తమ జట్టుకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఇదే మ్యాచ్‌లో 270 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఇండియా మాస్టర్స్‌కు కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ సూపర్‌ స్టార్ట్‌ ఇచ్చాడు. భారీ సిక్సులతో ఆస్ట్రేలియా బౌలర్లను వణికించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి సచిన్‌ అదరగొట్టారు. ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు సెంచరీలు చేసినా.. ఆ తర్వాత సచిన్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్, ఆ షాట్లకు స్టేడియం హోరెత్తిపోయింది. ముఖ్యంగా స్ట్రెయిట్‌గా కొట్టిన ఓ సిక్స్‌ అయితే కనుల విందుగా ఉంది. అయితే సచిన్‌ మినహా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో టీమిండియా 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.