AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇంగ్లండ్‌పై విజయం.. దద్దరిల్లిన తాలిబన్ల దేశం! రోడ్లపైకి వచ్చి ఎలా రచ్చ చేశారో చూడండి!

ఆఫ్ఘనిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై అనూహ్య విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన 177 పరుగులతో ఆఫ్ఘన్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తీవ్ర పోరాటం చేసినా 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాలిబాన్ పాలన ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్థాన్ లో జరిగిన సంబరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Video: ఇంగ్లండ్‌పై విజయం.. దద్దరిల్లిన తాలిబన్ల దేశం! రోడ్లపైకి వచ్చి ఎలా రచ్చ చేశారో చూడండి!
Afganistan
SN Pasha
|

Updated on: Feb 27, 2025 | 2:08 PM

Share

క్రికెట్‌లో ఏ టీమ్‌ అయినా అసాధారణ విజయం సాధిస్తే.. ఆ దేశపు క్రికెట్‌ అభిమానులు సంబురాలు చేసుకోవడం కామన్‌. ఇండియాలో మన టీమ్‌ పాకిస్థాన్‌పై గెలిస్తే, వరల్డ్‌ కప్‌ లాంటి బిగ్‌ ఈవెంట్స్‌ గెలిస్తే దేశంలో సంబురాలు చేసుకుంటారు జనం. కానీ, ఆఫ్ఘనిస్థాన్‌లో మాత్రం బుధవారం రాత్రి పెద్ద ఎత్తున్న సంబురాలు జరిగాయి. ఆ దేశపు పట్టణాల్లోని గల్లీ గల్లీ దద్దరిల్లింది. జనమంతా రోడ్లపైకి వచ్చేశారు. బైకులు, ఆటోలతో స్టంట్లు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తి చేశారు. కొన్ని చోట్ల బాణాసంచా కూడా కాల్చారు. ఇదంతా ఎందుకు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆఫ్ఘాన్‌ జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇది కేవలం గ్రూప్‌ మ్యాచ్‌ అయినప్పటికీ.. ఇంగ్లండ్‌ లాంటి ఒక స్ట్రాంగ్‌ టీమ్‌పై గెలుపు వారికి ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. అది కూడా హై స్కోరింగ్‌ గేమ్‌లో చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్భుతమైన విజయం అందుకోవడంతో ఆఫ్ఘాన్‌లోని క్రికెట్‌ అభిమానులంతా రోడ్లపైకి వచ్చిన సంబురాలు చేసుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రూలింగ్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. తాలిబన్లు ఇలాంటి సంబురాలకు వ్యతిరేకం అయినా కూడా క్రికెట్‌ అభిమానులను వాళ్లు అడ్డుకోలేకపోయారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 146 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సులతో 177 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే కెప్టెన్‌ షాహిదీ 40, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 41, సీనియర్‌ ప్లేయర్‌ నబీ 40 పరుగులతో రాణించడంతో ఆఫ్ఘాన్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ , లివింగ్‌స్టన్‌ 2, ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే అజ్మతుల్లా, నబీ భారీ షాక్‌ ఇచ్చారు.

ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌, వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌లను వెంటవెంటనే అవుట్‌చేశారు. దీంతో ఇంగ్లండ్‌ కేవలం 30 పరుగులకే 2 వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌తో కలిసి 50కి పైగా పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇక ఎండ్‌లో జో రూట్‌ క్రీజ్‌లో పాతుకపోయినా.. మరో ఎండ్‌లో బ్రూక్‌, బట్లర్‌ రాణించినా ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. చివర్లో ఓవర్టన్‌ 32 పరుగులతో రాణించినా కీలక సమయంలో అవుట్‌ కావడంతో ఆఫ్ఘాన్‌ మరింత పట్టు బిగించింది. మొత్తం ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆఫ్ఘాన్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, ఛాంపియన్స్‌ ట్రోఫీలో చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో అజ్మతుల్లా 5, మొహమ్మద్‌ నబీ 2, ఫరూఖీ, రషీద్‌ ఖాన్‌, గుల్బద్దీన్‌ నైబ్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.