Abhishek Sharma : అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ రికార్డు.. సూర్యకుమార్, కోహ్లీ రికార్డులు బ్రేక్
ఆసియా కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో 7 మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న యువ సంచలనం అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఐసీసీ పురుషుల బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, అతని రేటింగ్ పాయింట్లు ఏకంగా 931కి పెరిగాయి.

Abhishek Sharma : ఆసియా కప్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 7 మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పురుషుల టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ, ఏకంగా 931 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు.
అభిషేక్ శర్మ 2024లో టీ20 క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి కేవలం 15 నెలల్లోనే 849 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ దాదాపు 200గా ఉంది, ఇది ఓపెనింగ్ బ్యాటర్‌గా అంతర్జాతీయ జట్లు కోరుకునే అన్ని లక్షణాలకు నిదర్శనం. ఈ స్వల్ప కాలంలోనే అభిషేక్ శర్మ రెండు సెంచరీలు కూడా నమోదు చేసుకున్నాడు. ఆసియా కప్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన, ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆధునిక బ్యాటర్‌లలో ఒకడిగా అతన్ని నిలబెట్టింది.
అభిషేక్ శర్మ సాధించిన 931 పాయింట్లు, టీ20 క్రికెట్‌లో గతంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ 2020లో నెలకొల్పిన 919 పాయింట్ల రికార్డును బద్దలు కొట్టాయి. అంతేకాకుండా, గతంలో భారత నంబర్ వన్ బ్యాటర్లుగా ఉన్న సూర్యకుమార్ యాదవ్(912 పాయింట్లు), విరాట్ కోహ్లీ(909 పాయింట్లు) రికార్డులను కూడా అభిషేక్ శర్మ అధిగమించాడు.
ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ మూడో స్థానంలో నిలిచాడు. టోర్నమెంట్‌లో భారత్‌పై అద్భుతమైన సెంచరీ సాధించిన పథుమ్ నిస్సంక ఐదో స్థానానికి ఎగబాకాడు.
టీ20 క్రికెట్‌లో వరుణ్ చక్రవర్తి టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా తన స్థానాన్ని కోల్పోయాడు. పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ హార్దిక్ పాండ్యాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్‌లో సైమ్ అయూబ్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో నాలుగుసార్లు డకౌట్ అయి, కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు.
దేశీయ, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన తర్వాత, అతనికి భారత వన్డే జట్టు నుండి పిలుపు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లకు డిప్యూటీగా అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకోవడం గురించి చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




