AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!

Vaishakha Pournami: వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువు, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ వ్రతం, సంపద గౌరీ వ్రతం, దానధర్మాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. తులసి మాల సమర్పణ, విష్ణు సహస్రనామ పారాయణం, ఉదక కుంభ దానం, అన్నదానం విశేష ఫలాలనిస్తాయి. నరఘోష, నరదృష్టి నివారణకు సముద్ర స్నానం లేదా ఉప్పుతో స్నానం చేయాలని సూచించబడింది.

వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర ఫలితాలు!
Vaishakha Pournami Benefits
Rajashekher G
|

Updated on: May 01, 2026 | 6:00 AM

Share

వైశాఖ పౌర్ణమి హిందూ ధర్మంలో ఒక మహత్తరమైన పర్వదినం. ఈ రోజున చేయవలసిన పూజా విధానాలు, ఆచరించవలసిన దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి. వైశాఖ పౌర్ణమి బుద్ధ భగవానుడు జన్మించిన రోజుగా, విష్ణువు కూర్మావతారం ఎత్తిన రోజుగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాకుళంలోని శ్రీకూర్మ క్షేత్రంలో ఈ రోజున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్నవరంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కళ్యాణం జరుగుతుంది. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విధిగా ఆచరించాలని శాస్త్రం చెబుతోంది.

నైవేద్యంగా..

ఈ పవిత్ర దినాన విష్ణువు చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని తులసి మాలతో అలంకరించి, లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. దానిమ్మపండు లేదా పాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజు ఉపవాసం ఉండటం మరింత శ్రేయస్కరం. దానధర్మాలు, ముఖ్యంగా సాలగ్రామ దానం అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

ఏ దానాలు చేస్తే..

దానాల విషయానికి వస్తే, రాగి కలశంలో లేదా మట్టి కుండలో నీటిని నింపి ఉదక కుంభ దానం చేయాలి. అలాగే విసనకర్ర, చెప్పులు, గొడుగు, చల్లటి ఖద్దరు వస్త్రాలను అవసరమున్న వారికి లేదా బ్రాహ్మణునికి దానం చేయాలి. ఎంత అన్నదానం చేస్తే అంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ విధంగా దానధర్మాలు ఆచరించడం వల్ల పాపనాశనం జరిగి, కోరిన కార్యాలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి. విష్ణువు, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్ల సమస్త కార్యాలలో విజయం కలుగుతుంది.

గౌరీ వ్రతంతో..

శాస్త్రం ప్రకారం, ఈ వైశాఖ పౌర్ణమి రోజున సంపద గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల గొప్ప శుభాలు కలుగుతాయి. సాయంకాలం లేదా ఉదయం పూట పసుపుతో గౌరీదేవిని తయారు చేసి, షోడశోపచార లేదా పంచోపచార విధానంగా పూజించాలి. గౌరీ అష్టోత్తరముతో అర్చన చేసి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, గౌరీ సహస్రనామ పారాయణం చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువుకు జాకెట్ ముక్క, అద్దం, దువ్వెన, కాటుక, పూలు, గాజులు, చీర లేదా జాకెట్ పీసు, పండ్లు, దక్షిణతో కూడిన వాయనం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆ ముత్తైదువు అమ్మవారి స్వరూపంగా ఆశీర్వదించి, తరిగిపోని సంపదను, మాంగల్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.

ఇలా స్నానం చేస్తే..

నరఘోష, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందడానికి వైశాఖ పౌర్ణమి రోజున ఒక ప్రత్యేక పరిహారం ఉంది. కరక్కాయను తీసుకొని మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్యదిశలో తల చుట్టూ తిప్పి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించాలి. సముద్రం అందుబాటులో లేనివారు, స్నానం చేసే బకెట్ నీటిలో కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేయవచ్చు. ఇలా స్నానం చేస్తున్నప్పుడు అగస్త్య మహామునిని మనసులో స్మరించుకోవాలి. ఈ పరిహారం ద్వారా సర్వ నరఘోష, నరదృష్టి, శత్రుబాధలు తొలగిపోయి ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెబుతోంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us