PM స్వనిధి యోజన.. వీధి వ్యాపారులకు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్! ఎంత ఇస్తారంటే?
ప్రధానమంత్రి స్వనిధి యోజన చిన్న వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిస్తోంది. రూ.80,000 వరకు పూచీకత్తు లేని రుణాలు, కొత్తగా క్రెడిట్ కార్డ్ సౌకర్యం అందిస్తోంది. డిజిటల్ లావాదేవీలపై వడ్డీ రాయితీ, క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా చిన్న వ్యాపారులు అడుగులు వేయొచ్చు.

చిన్న వ్యాపారులను ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించే దిశగా ప్రధానమంత్రి స్వనిధి యోజన కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా అనంతరం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన వీధి వ్యాపారులకు మద్దతుగా ప్రారంభమైన ఈ పథకం, ఇప్పుడు రుణాలతో పాటు క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కూడా అందించేందుకు విస్తరించబడింది. దీని ద్వారా చిన్న వ్యాపారులకు నిర్వహణ మూలధనం సులభంగా అందుబాటులోకి వచ్చి, వారి వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపు వస్తోంది. ఈ పథకం కింద మొదటగా రూ.10,000 వరకు పూచీకత్తు లేకుండా రుణం అందిస్తారు. సమయానికి తిరిగి చెల్లిస్తే రూ.20,000, తరువాత రూ.50,000 వరకు రుణ పరిమితి పెరుగుతుంది. మొత్తం మూడు దశల్లో సుమారు రూ.80,000 వరకు రుణ సదుపాయం లభించే అవకాశం ఉంది. అదనంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 7 శాతం వరకు వడ్డీ రాయితీతో పాటు రూ.1,200 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది.
తాజా మార్పుల ప్రకారం లబ్ధిదారులకు క్రెడిట్ కార్డ్ సదుపాయం కూడా కల్పించనున్నారు. దీని ద్వారా సుమారు రూ.30,000 వరకు తక్షణ నిధులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది అత్యవసర వ్యాపార అవసరాలను తీర్చడంలో ఉపయోగపడనుంది. ఈ పథకం అమలులో షెడ్యూల్డ్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. రుణాల పంపిణీ ప్రక్రియను సులభతరం చేయడానికి SIDBI అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
అవసరమైన పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు ఉంటాయి. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి స్వనిధి యోజన వీధి వ్యాపారులకు కేవలం రుణ సహాయం మాత్రమే కాకుండా, ఆర్థిక స్వావలంబనకు దారితీసే ఒక బలమైన వ్యవస్థగా మారుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
