Tirumala Srivari Brahmotsavam: ఈసారి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలివే.. ఆ టికెట్ల దర్శనం లేనట్లే..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్మవాలకు ఉన్న ప్రత్యేకత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలని..

Tirumala Srivari Brahmotsavam: ఈసారి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకతలివే.. ఆ టికెట్ల దర్శనం లేనట్లే..
Tirumala
Follow us

|

Updated on: Sep 16, 2022 | 10:03 AM

Tirumala Srivari Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్మవాలకు ఉన్న ప్రత్యేకత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటుంటారు. దీనికోసం ఇప్పటికే చాలామంది ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే ఉంటారు. మరి కొంతమంది తిరుమల వెళ్లిన సరైన సమాచారం లేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ వ‌రకు బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌రు 20న ఉద‌యం 6 నుండి 11 గంట‌ల వ‌ర‌కు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సెప్టెంబ‌రు 26న రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. 27 నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 95 వేల నుంచి లక్ష మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు 18 నుంచి 19 గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరపడం, తమిళులకు ముఖ్యమైన పెరటాసి నెల రావడంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని టిటిడి అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోత్సవాల చరిత్రలోనే తొలిసారి అన్ని ప్రివిలేజ్‌, పేమెంట్‌, శ్రీవాణి, ఉదయాస్తమాన సేవలు, రూ.300, వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల దర్శనాలను నిలిపివేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో రూ.300 దర్శనం కూడా నిలుపుదల చేస్తూ టిటిడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా క్యూలైన్‌లోనే భక్తులను అనుమతించనున్నారు. ఎంత మంది వచ్చినా ఇదే విధానాన్ని అమలుచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తిరుమల మాడవీధుల్లో ఏర్పాటుచేసిన గ్యాలరీల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామిని వీక్షించేందుకు నాలుగైదు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేయనున్నారు. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో వచ్చే వీఐపీలకు నిర్ణీత సమయమిచ్చి దర్శనం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. కుటుంబ సభ్యులు మినహా ఇతరులను తీసుకొస్తే అనుమతించబోమని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డూ కొరత రాకుండా ముందుగానే తొమ్మిది లక్షల నిల్వ పెట్టుకుంటున్నారు. ప్రతి రోజు ఐదు లక్షల లడ్డూలు తయారుచేసి భక్తులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.

కల్యాణకట్టలో రోజూ 60వేల మందికి తలనీలాలు తీసేలా క్షురకులను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడసేవ రోజు రాత్రి 7గంటలకు వాహన మండపం నుంచి మాడవీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై విహరించనున్నారు. తరిగొండ వేంగమాంబ అన్నదానసత్రంతోపాటు బయట అన్నదాన ప్రసాద కేంద్రాలను భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలోనూ అన్నప్రసాదం అందిస్తారు. గరుడోత్సవం రోజు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కనుమ దారిలో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని టిటిడి అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..