తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్రం.. రథయాత్ర ప్రారంభం.. 1800 కి.మీ. మేర సాగే రథయాత్ర
తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ యాత్ర రథయాత్ర ప్రారంభమైంది. కంచి మఠం నుంచి ఈ రథయాత్ర కదిలింది. తిరుపతిలోని కంచి మఠంలో శ్రీరామయంత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి రథయాత్రను ప్రారంభించారు. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులోని కంచి మఠం ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.
కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు రథయాత్ర ప్రారంభం అయ్యింది. హిందూ ప్రచార రథయాత్రను కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పూజలు చేసి ప్రారంభించారు. తరవాత అనుగ్రహాభాషణం చేశారు. పురాతనమైన కంచిమఠంలో శ్రీరాముడి మూల యంత్రం ఉందని ఈ మహా యంత్రం లాగానే యాత్రాన్ని తయారు చేయించి అయోధ్యకు పంపుతున్నట్లు విజయేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. కంచి తరహాలో 150 కిలోల బంగారు పూత పూసిన శ్రీరామ యంత్రంతో భారీ ఆధ్యాత్మిక ఊరేగింపు నిర్వహిస్తూ అయోధ్యకు చేరుకోనున్నారు. అక్కడ రామాలయ సన్నిధిలో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్టిస్తారన్నారు. ఇప్పటికే రామాలయంలోని గర్భ గుడిలో బాల రాముడి మూల విరాట్ కింద విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బంగారు రామ యంత్రాన్ని ఉంచారని చెప్పారు. కంచిలో మహా శక్తివంతమైన శ్రీచక్ర యంత్రం ఉందన్నారు విజయేంద్ర సరస్వతి.
ఆలయాలు చైతన్య వంతంగా ఉండాలని, ఆలయాల నిర్మాణాలు చేపట్టడమే కాదు ఆ ఆలయాల ధూపదీప నైవేద్యాలు కూడా కొనసాగాలని తెలిపారు. టీటీడీ ఈ విషయంలో ఆదర్శంగా ఉందన్నారు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. ఆలయాల్లో భక్తి చైతన్యం, వికాసం ఉండాలని, యజ్ఞం, దానం, తపస్సు చేయాలన్నారు. ఇది మన దేశం ధర్మం, ఆచారం అన్నారు. భారతదేశం మౌనంగా ధర్మాన్ని ఆచరిస్తోందన్నారు విజయేంద్ర సరస్వతి.
ఈ నెల 27 నుంచి 17 వరకు పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి అయోధ్య వరకు 1800 కిలోమీటర్లు మేర రథయాత్ర సాగుతుందన్నారు. 45 రోజులు మండల దీక్ష అనంతరం అయోధ్యలో జనవరి 1న లక్ష చండీ యాగం జరుగుతుందని చెప్పారు. శ్రీవారి క్షేత్రం నుంచి రథయాత్ర ప్రారంభం కావడం శుభపరిణామన్నారు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..