టీమిండియా ఆలయ సందర్శనపై వివాదం.. వాళ్లకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్..
Harbhajan Singh Response Viral: టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత జట్టు ఆలయాన్ని సందర్శించడంపై మాజీ క్రికెటర్ కిర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలకు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ మత సామరస్యంపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో కొత్త వాదోపవాదాలకు కారణమైంది.

Team India Temple Visit Controversy: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లిన విషయంపైకీర్తి ఆజాద్ (Kirti Azad) ప్రశ్నలు లేవనెత్తారు. భారత జట్టులో వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారని, అలాంటప్పుడు ఆలయంతో పాటు మసీదు, చర్చ్ లేదా గురుద్వారాలను కూడా సందర్శించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత క్రికెట్ జట్టు 1.4 బిలియన్ భారతీయులను ప్రతినిధ్యం వహిస్తుందని, కాబట్టి వేడుకలు అన్ని మతాల సమానత్వాన్ని ప్రతిబింబించాలి అని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
హర్భజన్ సింగ్ ఘాటైన ప్రతిస్పందన..
హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కిర్తి ఆజాద్ వ్యాఖ్యలకు వెంటనే స్పందించారు. ఆయన మాటల్లో, ఆలయం, మసీదు, చర్చ్, గురుద్వారా అన్నీ ఒకేలా పవిత్రమైన ప్రార్థనా స్థలాలు అని చెప్పుకొచ్చాడు. ఎవరికైనా తమ విశ్వాసం ప్రకారం దేవుడిని ప్రార్థించే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశాడు.
“ఒక ఆటగాడు లేదా బోర్డు సభ్యుడు తన విశ్వాసాన్ని పాటిస్తే అందులో తప్పేముంది? ట్రోఫీని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు” అని హర్భజన్ పేర్కొన్నాడు. మతాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయడం సరైంది కాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
వివాదం నుంచి దూరంగా ఇషాన్ కిషన్..
ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఈ వివాదంపై స్పందించకుండా చాలా సమతూకంగా వ్యవహరించాడు. పాట్నాలో మీడియాతో మాట్లాడినప్పుడు జర్నలిస్టులు కిర్తి ఆజాద్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, కిషన్ చాకచక్యంగా దానిని తప్పించుకున్నాడు. “మేం వరల్డ్ కప్ గెలిచాం. ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దయచేసి జట్టు విజయంపై ప్రశ్నలు అడగండి” అని ఆయన మీడియాకు చెప్పాడు.
క్రికెట్ ప్రపంచంలో చర్చ..
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు కిర్తి ఆజాద్ అభిప్రాయాన్ని సమర్థించగా, మరికొందరు హర్భజన్ సింగ్ చెప్పిన మత సామరస్య భావనను మద్దతు ఇచ్చారు. భారత జట్టు ఇటీవల సాధించిన వరల్డ్ కప్ విజయం దేశవ్యాప్తంగా ఆనందాన్ని కలిగించినప్పటికీ, ఈ వివాదం క్రికెట్, మతం మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చలకు దారి తీసింది.
టీమిండియా విజయం దేశానికి గర్వకారణం. అయితే ఈ సంఘటన మత సామరస్యంపై చర్చకు దారితీసింది. క్రికెట్ అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఆట కంటే పెద్దది ఏదీ లేదని, విజయాన్ని అందరూ కలిసి ఆనందించాలనే భావన మరింత బలపడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
