AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వద్దంటే వద్దు.. ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 7 ఆహారాలు తినకండి..

ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం రోజంతా జీర్ణక్రియ, శక్తి స్థాయిలపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం, ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం కాఫీ, టీ, పుల్లని పండ్లు, ఎక్కువ మసాలా ఆహారం, కార్బోనేటెడ్ డ్రింక్స్, పచ్చి కూరగాయలు, చల్లటి పెరుగు వంటి పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

వద్దంటే వద్దు.. ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 7 ఆహారాలు తినకండి..
Empty Stomach Food
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2026 | 1:55 PM

Share

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో జీవనశైలిని మెరుగుపర్చుకోవడం, అలాగే సరైన ఆహారంపై దృష్టి సారించడం మంచిది.. ముఖ్యంగా పోషకాలు, ఖనిజాలు కలిగిన ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని.. అలాగే శరీరాన్ని దృఢంగా కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ముఖ్యంగా మనం తీసుకునే అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్).. ఉదయం లేవగానే మనం తీసుకునే మొదటి ఆహారం రోజంతా మన జీర్ణవ్యవస్థను, శక్తి స్థాయిలను, హార్మోన్ల సమతుల్యతను నిర్దేశిస్తుంది. ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాళీ కడుపుతో సరైన ఆహారం తీసుకోకపోతే జీర్ణాగ్ని మందగించి కడుపులో ‘ఆమ’ (విషపదార్థాలు) పేరుకుపోతుంది.

అటు ఆయుర్వేదం, ఇటు ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ (Empty Stomach) తో తీసుకోకూడని 7 ప్రధాన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం..

కాఫీ-టీ: కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విపరీతంగా పెంచుతుంది. దీనివల్ల ఎసిడిటీ, నెమ్ము, చాతిలో మంట వస్తాయి. ఉదయాన్నే పెరిగే ‘కార్టిసాల్’ హార్మోన్ స్థాయిని మరింత పెంచి ఆందోళన, గుండె వేగం పెరగడానికి కారణమవుతుంది. కాఫీ, టీ ఉష్ణ, తీక్షణ గుణాలు కలిగి ఉండటం వల్ల పిత్త దోషాన్ని పెంచుతుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సిట్రస్ ఫ్రూట్స్ (పుల్లని పండ్లు): బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లలో ఆమ్ల గుణం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తింటే గ్యాస్ట్రిక్ లైనింగ్ ఇరిటేట్ అయ్యి GERD, కడుపు మంట వంటి సమస్యలు వస్తాయి. వీటిని ఉదయాన్నే కాకుండా మిడ్-మార్నింగ్ (మధ్యాహ్నానికి ముందు) సమయంలో తీసుకోవడం శ్రేయస్కరం.

ఎక్కువ మసాలా ఉన్న ఆహారాలు – నూనె పదార్థాలు: మిరపకాయల్లో ఉండే క్యాప్సిసిన్ కడుపులోని సున్నితమైన పొరను ఇరిటేట్ చేస్తుంది.. ఖాళీ కడుపుతో ఉష్ణగుణం ఉన్న మసాలాలు తింటే పిత్తం పెరిగి, దీర్ఘకాలంలో అల్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంకా నూనె పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

కార్బోనేటెడ్ డ్రింక్స్ (సోడాలు & సాఫ్ట్ డ్రింక్స్): వీటిలోని కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. వీటిలోని అధిక చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచి, ఆ తర్వాత త్వరితగతిన పడిపోయేలా చేస్తుంది. ఫలితంగా నీరసం ఆవరిస్తుంది.

పచ్చి కూరగాయలు (Raw Vegetables / Salads): పచ్చి కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే జీర్ణాగ్ని తక్కువగా ఉన్న సమయంలో పచ్చి సలాడ్లు తింటే అరిగించుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా IBS (Irritable Bowel Syndrome) ఉన్నవారికి ఉబ్బరం, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. వీటిని కాస్త స్టీమ్ (లైట్‌గా ఉడికించి) చేసి తినడం మంచిది.

పెరుగు (ముఖ్యంగా చల్లని పెరుగు): చల్లటి డైరీ పదార్థాలు జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పెరుగు కఫ దోషాన్ని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే గొంతులో కఫం చేరడం, ముక్కు బంధించడం వంటి సమస్యలు రావచ్చు.

అరటిపండు: అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో అరటిపండు ‘గురు గుణం’ (హెవీ) కలిగి ఉంటుంది కాబట్టి, దీన్ని నానబెట్టిన బాదం లేదా ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది.

ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి?

గోరువెచ్చని నీరు: కొద్దిగా పసుపు కలిపిన గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్: రాత్రి నానబెట్టిన బాదం లేదా కిస్మిస్ నీరు తాగడం వల్ల సులభంగా శక్తి లభిస్తుంది.

పల్చని గంజి : సులభంగా జీర్ణమై జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. రాగి, జొన్న, బార్లీ లాంటి తృణధాన్యాల గంజి తీసుకోవడం ఇంకా ఉత్తమం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us