- Telugu News Spiritual Statue of equality: sri ramanujacharya millennium celebration event end in muchintal
Statue of Equalaity: మహా పూర్ణాహుతితో ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం వేడుకలు
ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ మహాపూర్ణాహుతితో యజ్ఞం సుసంపన్నమైంది.
Updated on: Feb 14, 2022 | 9:17 PM

నవ శ్రీరంగం ముచ్చింతల్ లో భగవద్రామానుజుల 216 అడుగుల భవ్యవిగ్రహంతో పాటు,120 కిలోల స్వర్ణవిగ్రహ ప్రతిష్టాపనతో పుడమి పులకించింది...

శ్రీభగవద్రామానుజాచార్యుల దివ్యమంగళ రూపంతో యావత్ ప్రపంచం పరవశించింది.. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగిన ఆధ్యాత్మిక క్రతువును వీక్షించిన భక్తుల జన్మ ధన్యమైంది.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో.. చివరి రోజున యాగశాలలో సహస్ర కుండలాల లక్ష్మీనారాయణ మహాయాగాన్ని 5 వేల మంది రుత్వికులు సుసంపన్నం చేశారు.

మహాయజ్ఞం ఆవాహనంతో 1035 పాలికల్లోని సంప్రోక్షణ జలాలతో సమతామూర్తి స్వర్ణ విగ్రహానికి చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు.

ఒక జన్మలో దర్శించలేని 108 దివ్యదేశాలను ఒకే చోట దర్శించేలా సమతాక్షేత్రాన్ని ఆవిష్కరించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి.. సమతామూర్తి సంకల్పం ప్రారంభించిన నుంచి ఎంతో మంది భక్తుల సంపాదన.. రామానుజుల సమతామూర్తి కేంద్ర నిర్మాణంలో ఉందన్నారు. ముఖ్య కార్యనిర్వాహకులైన జూపల్లి రామేశ్వర్రావు, వనజా భాస్కర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.

లక్షలాది మంది భక్తులు, వికాస తరంగిణి కార్యకర్తలు, అర్చకుల వైదిక క్రతువు.. సహస్రాబ్ది వేడుకలకు వన్నె తెచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.

మహాయాగంలో భాగస్వాములైన రుత్వికులను చినజీయర్ స్వామి సన్మానించారు. ఈనెల 19న జరిగే శాంతి కల్యాణానికి అవకాశం ఉన్న రుత్వికులంతా రావాలని ఆహ్వానించారు.

ముచ్చింతల్‌కు పోటెత్తారు భక్తజనం. చివరి రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. సమతామూర్తిని దర్శించుకొని.. పునీతులయ్యారు.

ముచ్చింతల్ శ్రీరామనగరం వెలిగిపోతోంది. ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఆధ్యాత్మిక వైభవంతో ఉట్టిపడుతోంది.

ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ మహాపూర్ణాహుతితో యజ్ఞం సుసంపన్నమైంది.

ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. యజ్ఞంలోఓ భాగంగా విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైయ్యూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి పూజలను చేశారు.





























