AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర!

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో 12 ఏళ్లకు ఒకసారి జరిగే నందా దేవి రాజ్ జాత్ యాత్ర అపురూప ఆధ్యాత్మిక మహోత్సవం. సుమారు 280 కిలోమీటర్ల మేర మంచు కొండలు, దట్టమైన అడవులు, దుర్గమ మార్గాల గుండా సాగే ఈ పవిత్ర యాత్ర విశేషాలు తెలుసుకోండి.

12 ఏళ్లకు ఒక్కసారి.. 280 కి.మీ కఠిన ప్రయాణం.. 17 వేల అడుగుల ఎత్తులో నందాదేవి రాజ్ జాత్ మహాయాత్ర!
Nanda Devi Jat Yatra 2026 Telugu
Rajashekher G
|

Updated on: Sep 06, 2026 | 8:48 PM

Share

Nanda Devi Jat Yatra 2026 Telugu: ఉత్తరాఖండ్ హిమాలయాల్లో జరిగే అత్యంత క్లిష్టమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో నందా దేవి రాజ్ జాత్ యాత్ర ఒకటి. హిమాలయాల మహాకుంభంగా పేరుగాంచిన ఈ అపురూప యాత్ర సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు, వందలాది గ్రామాల ప్రజలు కలిసి నిర్వహించే ఈ యాత్ర ఉత్తరాఖండ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5న చమోలి జిల్లా పరిధిలోని కురుడ్ నందా ధామ్ నుంచి ఈ పవిత్ర యాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రయాణాన్ని నందా దేవి బడి జాత్ యాత్ర అని కూడా పిలుస్తారు. అయితే ఈసారి పూర్తి స్థాయి ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా స్థానిక కమిటీలు, గ్రామస్తుల సహకారంతో యాత్ర కొనసాగుతుండటం విశేషం. భారీ స్థాయిలో అధికారిక రాజ్ జాత్ యాత్రను మాత్రం 2027లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నందాదేవి పుట్టింటి నుంచి కైలాసానికి వెళ్లే యాత్ర

గర్వాల్, కుమావోన్ ప్రాంతాల సంప్రదాయం ప్రకారం నందాదేవిని కేవలం ఒక దేవతగా మాత్రమే కాకుండా తమ ఇంటి ఆడపడుచుగా, పర్వత ప్రాంతపు కన్నకూతురిగా స్థానికులు భావిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం శివుడితో వివాహం అనంతరం నందాదేవి తన పుట్టింటి నుంచి భర్త నివాసమైన కైలాసానికి వెళ్లే ప్రయాణానికి ప్రతీకగానే ఈ యాత్ర నిర్వహిస్తారు. సుమారు 280 కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ ప్రయాణంలో భక్తులు అనేక గ్రామాలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు దాటుతూ కాలినడకన పయనిస్తారు. ప్రకృతి అందాలతో పాటు అత్యంత ప్రమాదకరమైన మార్గాలు కూడా ఉండటంతో ఈ యాత్ర భక్తికి, సాహసానికి ఒక గొప్ప పరీక్షగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

రాజ్ జాత్, లోక్ జాత్ మధ్య తేడా ఏంటి?

నందాదేవి యాత్రలో రాజ్ జాత్, లోక్ జాత్ అనే రెండు రకాల యాత్రలు ఉండటంతో చాలామందిలో కొంత గందరగోళం కనిపిస్తుంది. ప్రతి ఏడాది స్థానికంగా జరిగే సాధారణ యాత్రను లోక్ జాత్ అని పిలుస్తారు. అయితే 12 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా, అనేక గ్రామాల ప్రజలు, వందలాది దేవతల పల్లకీలతో కలిసి నిర్వహించే మహాయాత్రను రాజ్ జాత్ లేదా బడి జాత్‌గా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో ఈ యాత్రను స్థానిక రాజులు తమ పర్యవేక్షణలో నిర్వహించేవారు. అందుకే దీనికి రాజ్ జాత్ అనే ప్రత్యేక పేరు వచ్చినట్లు చెబుతారు.

నాలుగు కొమ్ముల మేకపోతు ప్రత్యేక ఆకర్షణ

ఈ యాత్రలో అత్యంత ఆసక్తికరమైన, విశేషమైన అంశం నాలుగు కొమ్ములున్న మేకపోతు. ఈ ప్రత్యేక మేకపోతు యాత్రలో కీలక పాత్ర పోషిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఇది యాత్రకు ముందుండి నడిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. యాత్ర చివరి దశలో హోమ్‌కుండ్ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు.

17 వేల అడుగుల ఎత్తులో సాహసయాత్ర

సముద్ర మట్టానికి సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండే జునార్గలీ పాస్ వంటి అత్యంత క్లిష్టమైన మార్గాల గుండా ఈ యాత్ర సాగుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, పచ్చని బుగ్యాల్స్, లోతైన లోయల మధ్య సాగే ఈ ప్రయాణంలో పాల్గొనడం అంత సులభం కాదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కఠినమైన కొండ మార్గాలు భక్తుల సహనాన్ని పరీక్షిస్తాయి. అయినప్పటికీ అమ్మవారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసంతో వేలాది మంది ఈ యాత్రలో పాల్గొంటారు. యాత్ర సందర్భంగా చమోలి జిల్లా గ్రామాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. గ్రామస్తులు తమ ఇళ్లను ప్రత్యేకంగా అలంకరించి, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువులను కూడా ఈ పవిత్ర ఘట్టానికి ఆహ్వానిస్తారు.

నందాదేవికి పుట్టింటి నుంచి వీడ్కోలు పలికే సమయంలో స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. తమ ఇంటి ఆడపడుచును అత్తవారింటికి పంపిస్తున్నామనే భావనతో కన్నీటి వీడ్కోలు పలుకుతారు. ఈ దృశ్యాలు యాత్రలోని భక్తి, భావోద్వేగాల తీవ్రతను ప్రతిబింబిస్తాయి. మంచు కొండలు, పచ్చని బుగ్యాల్స్, దట్టమైన అడవులు, ప్రమాదకరమైన పర్వత మార్గాల గుండా సాగే ఈ అద్భుతమైన బడి జాత్ యాత్ర సెప్టెంబర్ 30న హోమ్‌కుండ్‌లో ప్రత్యేక పూజలతో ముగియనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మవారిపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో భక్తులు ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు.

ఏళ్ల తరబడి ఒకే నమ్మకం, ఒకే సంప్రదాయంతో కొనసాగుతున్న నందా దేవి రాజ్ జాత్ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు. ఉత్తరాఖండ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో వారి అనుబంధం, అపారమైన భక్తికి సజీవ సాక్ష్యంగా నిలిచే అపురూప మహాయాత్ర.

Follow Us