AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత సంపాదించినా.. డబ్బు నిలవడం లేదా..? ఈ దీపం పెడితే లక్ష్మీకటాక్షంతో సంపద వర్షం..!

Lakshmi blessings: ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో లక్ష్మీ కటాక్షం కోసం “ఐశ్వర్య దీపం” వెలిగించడం శుభప్రదమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపంగా పిలుస్తారు. ఈ దీపం పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత సంపాదించినా.. డబ్బు నిలవడం లేదా..? ఈ దీపం పెడితే లక్ష్మీకటాక్షంతో సంపద వర్షం..!
Lamp for Lakshmi’s Blessings
Rajashekher G
|

Updated on: Feb 13, 2026 | 10:25 AM

Share

హిందూ శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యాలకు అధిదేవతగా భావించబడుతుంది. ఆమె అనుగ్రహం ఉంటే సిరిసంపదలు పెరుగుతాయని విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు అనేక విధాలుగా పూజలు చేస్తుంటారు. అయితే పూర్వకర్మ ఫలితంగా కొన్నిసార్లు దారిద్య్ర సమస్యలు వెంటాడుతాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భాల్లో లక్ష్మీ కటాక్షం కోసం “ఐశ్వర్య దీపం” వెలిగించడం శుభప్రదమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపంగా పిలుస్తారు. ఈ దీపం ఎవరు.. ఎందుకు పెట్టాలి.? ఈ దీపం పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపం ఎవరు పెట్టాలి?

సంపాదన ఉన్నప్పటికీ ధనం నిలవక ఇబ్బందులు పడుతున్న వారు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు తక్కువ ఆదాయంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు రుణబాధలు ఎక్కువగా ఉన్న వారు దృష్టిదోషం లేదా ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారు ఇలాంటివారు ఈ దీపాన్ని నియమంగా వెలిగిస్తే మంచిదని నమ్మకం.

ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి?

ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఐశ్వర్య దీపం వెలిగించాలి. రెండు పెద్ద ప్రమిదలు తీసుకుని పసుపు, కుంకుమ రాయాలి. భూశుద్ధి చేసి బియ్యంపిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేయాలి. పెద్ద ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి అందులో సుమారు పావుకిలో రాళ్ల ఉప్పు పోయాలి. దానిపై పసుపు, కుంకుమ చల్లాలి. రెండు చిన్న ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి అలంకరించాలి. వాటిలో ఆవు నెయ్యి నింపి రెండు వత్తులు పెట్టి దీపం వెలిగించాలి.

పఠించవలసిన శ్లోకం

దీపం వెలిగించే సమయంలో ఈ శ్లోకం చదవాలి.. “దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన దీపో హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే” ఆ తర్వాత దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పాలు, పళ్లు, పటికబెల్లం, కొబ్బరికాయ లేదా శక్తికొద్దీ నైవేద్యం సమర్పించాలి. వేంకటేశ్వరస్వామి స్తోత్రం, అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధార స్తోత్రం చదివితే మరింత శ్రేయస్కరం.

ఉప్పు ఏమి చేయాలి?

దీపారాధనలో ఉపయోగించిన ఉప్పును మరుసటి రోజు ప్రవహించే నీటిలో కలపాలి. అది సాధ్యంకాకపోతే కొబ్బరి చెట్టు వేరుజట్టులో వేయవచ్చు. లేకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి.

ఎన్ని వారాలు చేయాలి?

తీవ్రమైన సమస్యలుంటే 11 లేదా 16 శుక్రవారాలు, దీర్ఘకాలిక ఫలితం కోసం 41 శుక్రవారాలు చేయాలి. ప్రత్యేకంగా పౌర్ణమి శుక్రవారం ఈ దీపం వెలిగిస్తే అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

పాటించవలసిన నియమాలు

దీపాన్ని ఇంటి ఈశాన్య మూలలో పెట్టడం శ్రేయస్కరం. రాళ్ల ఉప్పు పైనే దీపం ఉంచాలి. స్త్రీ, పురుష, వయస్సు భేదం లేకుండా ఎవరైనా దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా భక్తి, శ్రద్ధలతో ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీకటాక్షం లభించి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగుతాయని విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)