వేయి స్తంభాల గుడి ఆవరణలో కళ్యాణ మంటపం పునః నిర్మాణ.. విశిష్టతలు ఏంటో తెలుసా..?
కాకతీయుల తదనంతరం వేయి స్తంభాల గుడి ఆవరణలోని కల్యాణమండపం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఢిల్లీ సుల్తాన్ ల దండయాత్రలో రూపం కోల్పోయిన కల్యాణ మండపం మట్టిలో కలిసిపోయే దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే 2005లో ఈ కల్యాణ మండపం పునః నిర్మాణానికి బీజం పడింది. 2006లో ఫిబ్రవరి నెలలో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండపం పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
ఆ ఉక్కు సంకల్పానికి ఎన్నో చిక్కు ముడులు.. వూహించని సవాళ్లు.. ఎలాగైతే నేమి 19 ఏళ్ల తపస్సు ఫలించింది. 800 ఏళ్ల కాలంనాటి అపురూప కట్టడం మళ్లీ పునః నిర్మాణం జరిగింది. తిరిగి వెయ్యేళ్ల జీవకళతో రూపు దిద్దుకుంది..సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఆ అపురూప నిర్మాణం కళ్ళముందు నిలిచింది. చారిత్రక వేయి స్తంభాల గుడి ఆవరణలో తిరిగి ప్రాణం పోసుకున్న కల్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు అంకితం చేశారు. ఎంతమంది స్తపతులు ఆ చారిత్రక నిర్మాణాన్ని తిరిగి సజీవంగా నిలిపారు..? వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం విశిష్టత గురించి తెలుసుకుందాం.
కాకతీయుల వైభవానికి నిలువెత్తు నిదర్శనం వరంగల్ లోని అనేక చారిత్రక నిర్మాణాలు.. అబ్బుర పరిచే శిల్ప సంపద.. కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది 1000 స్తంభాల రుద్రేశ్వరాలయం, రామప్ప, కోట గుళ్ళు, ఖిలా వరంగల్.
కాకతీయుల నిర్మాణాలలో వెయ్యిస్తంభాల గుడి, రామప్ప దేవాలయాలకు ప్రత్యేక చరిత్ర ఉంది. సాండ్ బాక్స్ టెక్నాలజీతో చేపట్టిన ఈ నిర్మాణాలు ఎలాంటి ఉపద్రవాలనైన ఎదుర్కొని సజీవంగా నిలబడ గల టెక్నాలజీ తో ఈ ఆలయాలు నిర్మాణం చేపట్టారు. 800 ఏళ్ల క్రితమే ఎంతో అద్భుత సాంకేతిక నైపుణ్యంతో ఈ ఆలయాల నిర్మాణం చేపట్టారు. వెయ్యి స్తంభాల గుడి కల్యాణ మండపం క్రీ.శ 1163లో నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. భవిష్యత్ పరిణామాలను ముందే పసిగట్టి ఇసుక పునాదుల మీద ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆలయాలు ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా చెక్కు చెదరకుండా నిలబడ్డాయి.. ఈ ఆలయాలలో కనిపించే అపురూప శిల్పసంపద మనసు పులకరించి పోయేలా చేస్తుంది.
కాకతీయుల తదనంతరం వేయి స్తంభాల గుడి ఆవరణలోని కల్యాణమండపం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఢిల్లీ సుల్తాన్ ల దండయాత్రలో రూపం కోల్పోయిన కల్యాణ మండపం మట్టిలో కలిసిపోయే దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే 2005లో ఈ కల్యాణ మండపం పునః నిర్మాణానికి బీజం పడింది. 2006లో ఫిబ్రవరి నెలలో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండపం పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసింది.
చెన్నయ్ కి చెందిన స్థపతి శివకుమార్ నేతృత్వంలో శిల్పకళా నైపుణ్యం కలిగిన బృందం 18 ఏళ్ల పాటు శ్రమించారు. మధ్యలో కొన్ని రోజులపాటు నిధుల సమస్యతో పనులకు ఆటంకం కలిగినా ఆశయం ముందు ఆటంకాలు ఓడి పోయాయి. తిరిగి కల్యాణ మండపం రూపు దిద్దుకుంది. 5 మీటర్ల లోతు ఇసుక పునాదుల పైన ఈ కల్యాణ మండపం పునః నిర్మాణం చేపట్టారు..132 పిల్లర్లు, 160 దిమ్మెలతో అలనాటి వైభవం ఉట్టిపడేలా చేశారు.
ఎలాంటి సిమెంట్, ఐరన్, కాంక్రీట్ మెటీరియల్ వాడకుండా విప్పి పునఃనిర్మాణం చేసిన ఎకైక నిర్మాణంగా ఈ కల్యాణ మండపం ప్రత్యేకత సంతరిచుకుంది. పూర్తిగా సాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ కల్యాణ మండపం నిర్మాణం జరిగింది. మరో వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా డంగు సున్నం, కరక్కాయ, బెల్లం ఉపయోగించిన చూర్ణంతో పునఃనిర్మాణం చేపట్టారు. ఢిల్లీ సుల్తాన్ ల దండయాత్రలో పూర్తిగా రూపం కోల్పోయిన అపురూప నంది విగ్రహం ఇప్పుడు జీవకళతో ఉట్టి పడుతుంది.. రుద్రేశ్వరుడి త్రికూటాలయంకు అభిముఖంగా నంది విగ్రహానికి ప్రాణం పోశారు.
ఇంటాక్ సంస్థ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు ప్రత్యేక చొరవతో ఈ కల్యాణ మండపం మళ్లీ సజీవంగా కళ్ళముందు నిలబడింది. ఆ శివుడే తన చేత ఈ మహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపించాడని.. తన జన్మ ధన్యమైందని అన్నారు. వీరి సంకల్పం…కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సహకారం తో ఈ అపురూప నిర్మాణం కళ్ళ ముందు నిలిచింది.. ఎనిమిది వందల ఏళ్ల తర్వాత ఈ మహా శివరాత్రి పర్వదినాన ఈ కల్యాణ మండపంలో మహాశివుడి కళ్యాణం నిర్వహించారు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించి ఈ చారిత్రక నిర్మాణాన్ని ప్రజలకు అంకితం చేశారు. పునర్జీవం పోసిన స్థపతి తో సహా శ్రమించిన ప్రతి ఒక్కరినీ కిషన్ రెడ్డి సత్కరించారు. తన చేతుల మీదుగా ఇంతటి పుణ్యకార్యం నిర్మాణం జరుగడం అదృష్టంగా భావిస్తున్నానన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… వెయ్యి స్తంభాల గుడి ఇప్పుడు పరిపూర్ణంగా ఉందన్నారు. ఈ శివరాత్రి ఓరుగల్లు ప్రజలకు ఇదో అపురూప కానుకగా నిలిచింది.. 19 ఏళ్ల శ్రమ ఫలించి రూపు దిద్దుకున్న కల్యాణ మండపాన్ని చూసి ప్రతీ ఒక్కరూ ఆనందంతో మురిసి పోతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..