Spiritual Philosophy: భగవంతుడు మనల్ని నిజంగా పరీక్షలకు గురి చేస్తాడా..? ప్రముఖ యోగులు, జ్ఞానులు ఏమన్నారో తెలుసుకుందాం రండి..

దేవుడు తమను కఠినమైన పరీక్షలకు గురి చేస్తున్నాడని కష్టనష్టాల్లో ఉన్న చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుడు ఈ పరీక్షల నుంచి తమను విముక్తి చేసే వరకు తమకు ఈ కష్టాలు తప్పవని లోలోపల కుమిలిపోతుంటారు. దేవుడు తమకు ఈ రకమైన పరీక్షలు పెట్టకుండా..

Spiritual Philosophy: భగవంతుడు మనల్ని నిజంగా పరీక్షలకు గురి చేస్తాడా..? ప్రముఖ యోగులు, జ్ఞానులు ఏమన్నారో తెలుసుకుందాం రండి..
Spiritual Philosophy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 09, 2023 | 9:56 AM

దేవుడు తమను కఠినమైన పరీక్షలకు గురి చేస్తున్నాడని కష్టనష్టాల్లో ఉన్న చాలామంది భావిస్తూ ఉంటారు. దేవుడు ఈ పరీక్షల నుంచి తమను విముక్తి చేసే వరకు తమకు ఈ కష్టాలు తప్పవని లోలోపల కుమిలిపోతుంటారు. దేవుడు తమకు ఈ రకమైన పరీక్షలు పెట్టకుండా ఉండేందుకు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, భగవంతుడు భక్తులను నిజంగా పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడా..? తమ సత్యాన్వేషణలో భగవంతుడు అంటే ఎవరో తెలుసుకున్న యోగులు, మహాత్ములు దీని గురించి ఏమంటారో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా సోక్రటీస్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానంద, స్వామి చిన్నయానంద, స్వామి శివానంద, యూజీ కృష్ణమూర్తి వంటి యోగుల అనుభవ పూర్వక అభిప్రాయం ప్రకారం దేవుడు పరీక్ష పెట్టడం అనేది సత్యదూరమైన విషయం.

‘భగవంతుడు నీకు పరీక్ష పెడతాడు అనేది పచ్చి అబద్ధం. ఆయనకు వేరే పనులు ఉన్నాయి. నీకు పరీక్ష పెట్టాల్సిన అవసరం ఆయనకు లేద’ని రామకృష్ణులు ఒక ప్రశ్నకు సమాధానంగా తన భక్తులకు చెప్పారు. ఆయన పరీక్ష పెట్టడానికి కూడా మనకు ఒక తాహతు ఉండాలి. మనం ఆధ్యాత్మిక చింతనలో లేదా జ్ఞానమార్గంలో లేదా భక్తి మార్గంలో ఎంతో పురోగతి సాధించి ఉంటే తప్ప దేవుడు మన విషయాలలో జోక్యం చేసుకోవటం గానీ, పరీక్ష పెట్టడం గాని జరగదని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. ‘నా అనుభవంలో దేవుడు నాకేనాడు పరీక్ష పెట్టలేద’ని ప్రసిద్ధ తత్వవేత్త సోక్రటీస్ కూడా స్పష్టం చేశారు.

‘మనం సన్మార్గంలో వెళ్తున్నా, చెడు మార్గంలో వెళ్తున్నా దేవుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు తప్ప మనకు పరీక్షలు పెట్టడం అంటూ జరగదు. ప్రతిక్షణం ఆయన మనకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తాడు’ అని పరమాహంస యోగానంద తన గ్రంథాల్లో ప్రవచించారు. చెడు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన మనకు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అవరోధాలు, ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అయితే, మనం అందుకు సిద్ధంగా లేనప్పుడు మన కర్మకు మనల్ని వదిలేస్తాడు. సన్మార్గంలో వెళుతున్నప్పుడు మనకు వీలైనంతగా సహకరిస్తాడు. ఇదే విషయాన్ని యోగానంద అనుభవ పూర్వకంగా చెప్పడం జరిగింది.

ఇవి కూడా చదవండి

‘సాధారణంగా దేవుడు తన భక్తులకు గాని, తన సందర్శకులకు గాని పరీక్షలు పెట్టడం అంటూ జరగదు. మనమే మన మార్గం సరిగ్గా లేక దేవుడు అవరోధాలు సృష్టిస్తున్నట్టు భావిస్తామ’ని స్వామి శివానంద ఒక సందర్భంలో అన్నారు. ‘దేవుడు దయామయుడు. ప్రేమ స్వరూపుడు. పరీక్షలు పెట్టడం అనేది ఆయన తత్వంలో భాగం కాదు. మనవి సాధారణ జీవితాలు. ఈ సాధారణ జీవితాలకు పరీక్షలు పెట్టటం ఆయనకు అవసరమే లేద’ని ఆయన వివరించారు. “మనం మన ఆలోచనలను సరిదిద్దుకోవాలి. ఆయనను ప్రార్థించి మన పనులను ప్రారంభించుకోవాలి. ఆయన మనకు సహాయం చేయటానికి ఉన్నారు తప్ప పరీక్షలు పెట్టడానికి కాద’ని స్వామి శివానంద తన జీవిత కథలో రాసుకున్నారు. ఆయన నిజంగా మనకు పరీక్ష పెడితే మనం పుణ్యాత్ములమేనని కూడా శివానంద స్పష్టం చేశారు.

దేవుడు మనుషులకు పరీక్ష పెడతాడనే అభిప్రాయాన్ని స్వామీ చిన్నయానంద తోషిపుచ్చారు. ‘అది భ్రమ మాత్రమే. అందులో కొద్దిగా కూడా వాస్తవం లేదు’ అని ఆయన చెప్పారు. ‘దేవుడు మనల్ని సన్మార్గం లో నడిపించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా మనం చేసే పనులలో జోక్యం చేసుకోడు. ఏది మంచో, ఏది చెడో మనకు చెప్పాలని రకరకాల మార్గాలు అనుసరిస్తాడు. మనల్ని పరీక్షలకు గురి చేయడం, మనల్ని బాధ పెట్టడం ఆయన అభిమతం కాదు. మన ఆలోచనలే, మన మనసే మనల్ని ఇబ్బంది పెట్టటం, ఇరకాటంలో పెట్టడం వంటివి చేస్తాయి. మనం వాటిని గుర్తించక, గుర్తించడానికి ఇష్టపడక, అవన్నీ దేవుడు పెట్టే పరీక్షలని నమ్మించడానికి ప్రయత్నిస్తామ’ని ఆయన వివరించారు.

మరో ప్రసిద్ధ తత్వవేత్త యూజీ కృష్ణమూర్తి అభిప్రాయం ప్రకారం, “మనమే దేవుడు అనే వాడిని పరీక్షిస్తుంటాం. మనకు ఎవరూ పరీక్ష పెట్టరు. ఆ భ్రమలోంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. మన మీద మనం జాలి పడటానికి, సానుభూతి చూపించడానికి ఈ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాం” అని ఆయన ఒక సందర్భంలో తెలిపారు. మొత్తం మీద దేవుడిని, దేవుడి తత్వాన్ని కనుగొన్న మహాత్ములలో చాలామంది దేవుడు పరీక్ష పెడతాడన్న అభిప్రాయాన్ని గట్టిగా వ్యతిరేకించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..