భక్తజన సంద్రంగా శబరిమల.. సంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లే భక్తులకు ప్రభుత్వ వెసులుబాటు..!
పంపా నుండి సన్నిధానం వరకు సాంప్రదాయ ట్రెక్కింగ్ మార్గంలో, చివరకు 18 పవిత్ర మెట్లను అధిరోహించే ముందు స్వాముల కోసం పొడవాటి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్న క్రమంలో కొందరు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉంటే, శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో ప్రయాణించే సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు,..
భక్తుల తాకిడితో శబరిమల కిటకిటలాడుతోంది. కొండ మొత్తం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగిపోతోంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తులతో రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచేగాక వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
శబరిమల అయ్యప్ప పవిత్ర కొండకు వెళ్లే మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతున్న భక్తుల రద్దీ దేవస్థానం అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో వసతులు సరిపోవటం లేదు. పలువురు భక్తులు ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా పయనమవుతున్నారు. రద్దీని అదుపు చేసేందుకు పోలీసులు ఎరుమేలి వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. పంపా నుండి సన్నిధానం వరకు సాంప్రదాయ ట్రెక్కింగ్ మార్గంలో, చివరకు 18 పవిత్ర మెట్లను అధిరోహించే ముందు స్వాముల కోసం పొడవాటి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతున్న క్రమంలో కొందరు భక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
ఇదిలా ఉంటే, శబరిమల ఆలయానికి సంప్రదాయ అటవీ మార్గంలో ప్రయాణించే సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ముక్కుజి వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అజుతక్కడవు నుంచి వెళ్లేందుకు అనుమతిస్తారు. ఇంతకుముందు, ఈ పాయింట్లలోకి ప్రవేశం వరుసగా మధ్యాహ్నం 2.30 మరియు 3.30 గంటలకు పరిమితం చేయబడింది.
మరోవైపు, ఇటు ఏపీలోని శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు 4కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..