Panakala Swamy Temple : ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యం.. ఒక్క చీమ కూడా కనిపించని క్షేత్రం..
Panakala Swamy Temple: ఇటు నరుడు కాకుండా .. అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షుణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ..
Panakala Swamy Temple: ఇటు నరుడు కాకుండా .. అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షుణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నారసింహ. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహ స్వామి గా భక్తులతో కీర్తించబడుతున్నాడు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన స్వామిని పానకాల నరసింహ స్వామిగా భక్తులు పూజిస్తారు.
శ్రీ పానకాల నరసింహ క్షేత్ర స్ధలపురాణం:
మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన వున్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ వున్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంత స్వరూపులయ్యారు. మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు.స్వామివారికి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.
పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.
శ్రీ లక్ష్మి ఆలయం:
పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం వున్నది. దీనికి పక్కగా ఒక సొరంగం వుంటుంది. దాన్లోంచి వెళ్తే కృష్ణా తీరాన వున్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. ఋషులు ఇదివరకు ఆ మార్గంద్వారానే పయనించి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసివచ్చి స్వామిని సేవించేవారంటారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది. అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవని స్థల పురాణం.
పానకాల స్వామి మహత్యం గురించి ప్రచారంలో ఉన్న కధ ..
పానకాల స్వామి పానకం తాగటం ఎంతమటుకు నిజమో పరీక్షించటానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయడు పరీక్షించాలనుకున్నాడట. తన బావమరిది, శక్తి ఉపాసకులు అయిన యార్లగడ్డ అంకినీడుతో కలసి కొండపై స్వామివారి తెరిచివున్న నోట్లోకి తన కుడిచేతిని పోనిచ్చారుట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నవులుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందిట. అంకినీడుగారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడుగారు చెయ్యి బయటకి తియ్యగా చెయ్యి రక్త మాంసములు లేక శల్యావశిష్టంగా వుండటం చూసి విస్మయం చెందారుట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి, స్వామికి తన శరీరం ఆహారమయిందని, తన జన్మ సార్ధకమయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపచేశారుట.
కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం వుండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ దీపం పెడతామని మొక్కుకుని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు. కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబమల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను, ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారని స్థలం పురాణం ద్వారా తెలుస్తోంది.
పానకాల ఆలయ గాలిగోపురం విశిష్టత :
ఆలయానికి నాలుగువైపులా గాలి గోపురాలున్నా తూర్పున వున్న గాలి గోపురం నిర్మాణ శైలి వల్ల ప్రసిధ్దికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణంచేబట్టి 3 అంతస్తులు కట్టించారు. తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు క్రీ.శ. 1807 – 1809 లో ఈ గోపురం పై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపచేశారు. 153 అడుగుల ఎత్తు వున్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా వుండి ఇంత ఎత్తుగావున్న ఇలాంటి గోపురాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇది ప్రసిధ్దికెక్కింది. దీనిని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషంకూడా ప్రచారంలో వున్నది. గోపురము 14 అంతస్తులూ నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట. గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక, శిల్ప శాస్త్రంలో విజ్ఞుల సలహామేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సుప్రసిధ్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు.
ఆలయంలో జరిగే ఉత్సవాలు:
ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైనవి. శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మర్నాడు పౌర్ణమి రోజున రధోత్సవం నిర్వహిస్తారు. స్వామి దేవేరులతో సహా ఊరేగే ఈ పెద్ద రధం లాగటానికి భక్తులు పోటీ పడతారు. కనీసం ఆ రధం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు.ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరనాళ్ళుకూడా ప్రసిధ్దికెక్కింది.
ఆలయానికి వెళ్లే మార్గం :
విజయవాడ , గుంటూరు ద్వారాగా మంగళగిరికి చేరుకోవచ్చు. విజయవాడకు దాదాపు 16 కి.మీ. ల దూరంలో వున్న మంగళగిరి చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. కొండపైన పానకాలస్వామి ఆలయానికి మెట్ల మార్గమేకాక వాహనంలో కూడా చేరుకోవచ్చు.
Also Read: కోవిడ్ నిబంధనల నడుమ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపు ధ్వజారోహణ..