హుండీ ఘటన తర్వాత హై అలర్ట్.. దుర్గమ్మ ఆభరణాలు నిజంగా సేఫ్‌గా ఉన్నాయా?
Vijayawada Durgamma Ornaments: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆభరణాల భద్రతపై చర్చ కొనసాగుతోంది. ఇటీవల హుండీ లెక్కింపు సమయంలో ఒక వ్యక్తి బంగారం మార్పిడి ప్రయత్నంలో పట్టుబడటం భక్తుల్లో ఆందోళన కలిగించింది. దీంతో ఆలయ భద్రత, స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, ఆడిట్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనతో దేవాదాయ శాఖ అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆభరణాల భద్రతపై చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలతో భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మవారికి ఉన్న బంగారం, వెండి నిల్వలు ఎంత.. ఈ విలువైన నగల భద్రతకు ఎలాంటి వ్యవస్థ ఉంది? స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, ఆడిట్ ప్రక్రియ ఎలా ఉంది..? అసలు భద్రత పకడ్బందీగా ఉందా… లేక లోపాలున్నాయా..? ఇలా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన భక్తుల్లో ఆందోళనకు దారితీసింది. హుండీ లెక్కింపు సమయంలో ఒక వ్యక్తి అసలు బంగారాన్ని మార్చే ప్రయత్నంలో పట్టుబడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో ఆలయ భద్రతపై అనుమానాలు తలెత్తాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన దేవాదాయ శాఖ పలు కీలక చర్యలు ప్రారంభించింది.
హుండీ లెక్కింపు కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు, సిబ్బందిపై కఠిన తనిఖీలు, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేశారు. ప్రతి ఆభరణాన్ని పాత రికార్డులతో సరిపోల్చే ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. వివరాల ప్రకారం, ఆలయంలో భారీ స్థాయిలో బంగారం, వెండి నిల్వలు ఉన్నాయి.ఈ ఆభరణాలన్నీ ప్రత్యేక స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి, నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతున్నారు. అంతేకాకుండా, కొంత బంగారాన్ని గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వడ్డీ కూడా పొందుతున్నారు. క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహిస్తూ, రికార్డులు, ఆభరణాల మధ్య సరిపోల్చడం జరుగుతోంది. అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. లక్ష్మీ కాసుల హారాలు, వజ్రాలతో అలంకరించిన నగలు, బంగారు వీణ వంటి విశేష వస్తువులు భక్తులను ఆకర్షిస్తాయి. దసరా వేళ ప్రత్యేక అలంకరణల్లో ఉపయోగించే బంగారు ఆభరణాలు ఆలయ సంపదకు ప్రతీకగా నిలుస్తాయి. ఇటీవల కూడా భక్తులు విలువైన నగలను సమర్పించడం కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జ్యువెలరీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి ఆభరణాన్ని బరువు, డిజైన్, రికార్డులతో పోల్చి సమగ్రంగా పరిశీలిస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే… ఇటీవల జరిగిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. నిరంతర ఆడిట్‌లు, సాంకేతిక పర్యవేక్షణ, కఠిన నియంత్రణలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. అమ్మవారి ఆభరణాల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా మారింది.
