AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతరకు హెలీకాప్టర్​ రెడీ.. రౌండ్ ట్రిప్ ధర ఎంతంటే..?

మహా కుంభమేళాగా పిలిచే మేడారం వనదేవతల మహాజాతరకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఎల్లుండి నుంచి గిరిజన జాతర ప్రారంభం కానుండగా.., ఇప్పటికే నిత్యం వేలాది మంది మొక్కులు సమర్పించుకునేందుకు మేడారం బాటపట్టారు.. అటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారానికి చేరుకున్నారు.. ఆలయానికి చేరుకొని తులాభారంలో కూర్చొని ఎత్తు బంగారం సమర్పించారు

Medaram Jatara: మేడారం జాతరకు హెలీకాప్టర్​ రెడీ.. రౌండ్ ట్రిప్ ధర ఎంతంటే..?
Medaram Jatara
Ram Naramaneni
|

Updated on: Feb 19, 2024 | 7:41 PM

Share

తెలంగాణ, ఫిబ్రవరి 19:  మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే.. మాఘశుద్ధ మాసపు మంచి ఘడియలు వచ్చేస్తున్నాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో.. మేడారం కీకారణ్యంలో… ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ.. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి.. గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు.

మరుసటి రోజు 22వ తేదీ గురువారం సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యాంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనం నుంచి మొదలుకొని దేవతలను గద్దెల దగ్గర ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి..

కోటి 50 లక్షల మంది వస్తారని అంచనా…

సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే మేడారంలో ముందస్తు కోలాహలం కనిపిస్తోంది. ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా దాదాపు కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ గా మేడారం జారతకు ఓ ప్రత్యేకత ఉంది… ఈసారి జాతరకు అన్నీ తానై ఏర్పాట్లు చేస్తున్న స్థానిక మంత్రి ఆదివాసి బిడ్డ సీతక్క మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరుతున్నారు..

గిరిజన జాతరకు.. రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.. ఈ సారి భక్తుల కోసం వేల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతమున్న స్నానఘట్టాలకు తోడుగా అదనపు స్నానఘ‌ట్టాలను నిర్మించారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ సంఖ్యను కూడా పెంచారు. మేడారం మహాజాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభమయ్యాయి.

6 వేల ప్రత్యేక బస్సులు

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు 6 వేల బస్సులు నడుపుతోంది.. నాలుగు రోజులు ముందుగానే మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్‌ఆర్టీసీ. రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల్లో పికప్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. మొత్తంగా ఆరువేల బస్సులను నడుపుతోంది. 30 లక్షల మందిని మేడారం తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

సమ్మక్క- సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మేడారం వెళ్లే దారి తెలిసేలా రూపొందించిన మేడారం ర్యూట్‌ మ్యాప్‌విడుదల చేశారు. జాతర నిర్వహణలో పోలీస్ పాత్ర అత్యంత కీలకం. 500 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్, 12 డ్రోన్ కెమేరాలతో జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్న పోలీసులు.. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు.

అందుబాటులో హెలికాప్టర్ సేవలు 

దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వనప్రవేశం చేయించడం వరకు… అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేలలా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లినవారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయచ్చు!. హనుమకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా VIP దర్శనాన్ని పొందవచ్చు. దీని ధర రూ. ఒక్కొక్కరికి 28,999.హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. మరో రైడ్.. జాతర జరిగే ప్రాంతం మీదుగా  6 నుంచి 7 నిమిషాలు గాలిలో హెలికాప్టర్‍ చక్కర్లు కొట్టనుంది. అమ్మవారి గద్దెల పక్కనుంచి మొదలయ్యే రైడ్‍ జంపన్నవాగు, చిలుకలగుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాలమీదుగా ఉంటుంది. దీనికోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతన సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు.

సమ్మక్క సారక్క దేవతలను జాతర సమయంలో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం.. కోరిక తీరినవారు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. మేడారం మ‌హా జాత‌ర‌ తెలంగాణ సంరంభం.. భార‌తీయులంద‌రీ సంబురం.. వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క సారాల‌మ్మ‌ల‌కు దండాలు… జాన‌ప‌ద‌స‌జీవ‌న‌ చ‌రిత‌కు వంద‌నాలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us