AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివ్య శక్తుల తమలపాకులతో శని దోషాలకు చెక్.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!

Shani Dosha Remedy: తమలపాకులు భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచే ప్రత్యేక స్థానం పొందాయి. పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు వంటి ప్రతి శుభకార్యంలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. దేవాలయాల్లో కూడా ఇతర పూజా ద్రవ్యాలతో పాటు తమలపాకులు సమర్పించడం ఆనవాయితీ. ఆంజనేయస్వామికి తమలపాకులతో పూజ చేస్తే శని దోషాలు తొలగి, కార్యసిద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

దివ్య శక్తుల తమలపాకులతో శని దోషాలకు చెక్.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!
Betel Leaves
Rajashekher G
|

Updated on: Feb 12, 2026 | 9:02 AM

Share

Betel Leaves for Shani Dosha Remedy: తమలపాకులు.. భారతీయ సంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఒక భాగంగా వస్తున్నాయి. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. పూజలు, వ్రతాలు, నోములు, పెళ్లిళ్లు.. తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు జరిపేటప్పుడు కూడా ఇతర పూజా ద్రవ్యాలతో పాటు తమలపాకులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామికి తమలపాకులతో చేసే ఆకు పూజ ఎంతో ప్రీతికరంగా భావిస్తారు. ఆధ్యాత్మిక పరంగా ప్రతి విశేష సందర్భంలో తమలపాకులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే సృష్టిలో ఎన్నో చెట్లు, ఆకులు ఉండగా తమలపాకులకే ఈ ప్రత్యేకమైన పూజనీయ స్థానం ఎందుకు లభించిందో తెలుసుకుందాం.

తమలపాకుల ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయంలో పూజలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు తమలపాకులు లేకుండా పూర్తి కావని శాస్త్రోక్తంగా చెబుతారు. తాంబూలంలో తమలపాకులదే అగ్రస్థానం. శుభకార్యానికి సంపూర్ణత తీసుకురావడమే కాక, దివ్యశక్తులను ఆహ్వానించే పవిత్ర ద్రవ్యంగా వీటిని భావిస్తారు.

నాగవల్లి దళాల విశిష్టత

తమలపాకుల అసలు పేరు “నాగవల్లి దళాలు”. వీటిని “దేవతాదళాలు” అని కూడా అంటారు. పురాణాల ప్రకారం తమలపాకులలో సకల దేవతలు నివసిస్తారని నమ్మకం. అందుకే ఇవి పవిత్రమైనవిగా భావించి ప్రతి శుభకార్యంలో వినియోగిస్తారు. ఎంత వైభవంగా కార్యక్రమం చేసినా, తమలపాకు లేకపోతే అది అసంపూర్ణమేనని అంటారు. సకల దేవతల నిలయం

ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్యభాగంలో పార్వతీదేవి, కొన భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని చెబుతారు. అలాగే ఇంద్రుడు, మన్మథుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఇందులో వాసం చేస్తారని విశ్వాసం. అందుకే కొత్తగా పెళ్లైన దంపతులు తాంబూలం మార్చుకుంటే దాంపత్య జీవితం సౌఖ్యంగా సాగుతుందని పెద్దలు అంటారు.

దైవిక శక్తికి ప్రతీక

తమలపాకులను శ్రేయస్సు, ఐశ్వర్యం, మంగళానికి ప్రతీకగా భావిస్తారు. నోములు, వ్రతాల్లో ముత్తైదువులకు తాంబూలం ఇవ్వడం, భోజనం అనంతరం తాంబూలం సేవించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఆంజనేయస్వామికి తమలపాకుల పూజ

రామాయణంలోని సుందరకాండ ప్రకారం.. సీతాదేవి సందేశం అందించిన హనుమంతుడిని ఆనందంతో తమలపాకుల దండతో ఆశీర్వదించిందని విశ్వాసం. అప్పటి నుంచి ఆంజనేయుడికి తమలపాకులు అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తున్నారు. తమలపాకులతో పూజ చేస్తే శని దోషాలు తొలగి, కార్యసిద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

ఔషధ గుణాలు

ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు తమలపాకులకు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో వీటిని జీర్ణశక్తి పెంపు, శ్వాస సంబంధిత సమస్యల నివారణ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ఈ తప్పులు మాత్రం చేయొద్దు

పూజలలో వినియోగించే తమలపాకులు తాజాగా, సంపూర్ణంగా ఉండాలి. ఎండిపోయినవి, చిరిగినవి, తొడిమలేనివి వాడకూడదు. ముత్తైదువులకు ఇచ్చే తాంబూలంలో కూడా శుభ్రమైన తమలపాకులు మాత్రమే ఉండాలి. ఈ విధంగా తమలపాకులు కేవలం ఆచార సంప్రదాయాలకే కాదు, ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి కూడా మేలుచేసే పవిత్ర ద్రవ్యాలుగా ప్రత్యేక స్థానం పొందాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)