AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియా ఎక్కువగా వాడుతారా? అయితే మీరిక తప్పించుకోలేరు.. థర్డ్ ఐ నిఘాతో..

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోషల్ మీడియాపై నిఘా పెట్టింది. ఆత్మహత్య సంకేతాలు ఇచ్చే పోస్టులపై మెటాతో సమన్వయంతో ప్రాణాలను కాపాడుతోంది. గత 7 నెలల్లో 800 మందిని రక్షించింది. మహిళలను వేధించడం, ఫేక్ న్యూస్ వంటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రతి డిజిటల్ కదలిక రికార్డవుతుంది కాబట్టి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియా ఎక్కువగా వాడుతారా? అయితే మీరిక తప్పించుకోలేరు.. థర్డ్ ఐ నిఘాతో..
Telangana Cyber Security Bu
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 3:41 PM

Share

సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా ఎవరికీ తెలుస్తుందిలే, ఏం కాదులే అని అనుకునే రోజులు ఇక ముగిశాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలపై ప్రతి కదలికపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిఘా కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్యకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే పోస్టులు, స్టేటస్‌లు, సందేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మెటా సంస్థతో సమన్వయం చేసుకుంటూ ప్రాణాలను కాపాడే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

అలాంటి పోస్ట్‌లు పెడితే వెంటనే..

“ఇక బతకాలనిపించడం లేదు”, “ఇది నా చివరి పోస్ట్”, “చనిపోతున్నా.. గుడ్‌బై” వంటి సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిని మెటా ప్రత్యేక అల్గోరిథంల ద్వారా గుర్తిస్తోంది. అలాంటి అనుమానాస్పద పోస్టులు కనిపించగానే వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులకు సమాచారం చేరుతోంది. అనంతరం రంగంలోకి దిగుతున్న పోలీసులు సంబంధిత వ్యక్తుల లొకేషన్‌ను గుర్తించి, అత్యవసరంగా అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఏడు నెలల కాలంలో ఇలాంటి ఆత్మహత్య సంకేతాలు ఉన్న పోస్టులు చేసిన సుమారు 800 మందిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. వీరిలో 260 మంది తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. ప్రేమ విఫలం కావడం, పరీక్షల్లో ఫెయిల్ అవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించే ముందు సోషల్ మీడియాలో చివరి సందేశాలు పెట్టిన పలువురిని పోలీసులు సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ అందించి ప్రాణాలను కాపాడినట్లు తెలుస్తోంది.

అమ్మాయిల జోలికి వెళ్లారో.. అంతే

మరోవైపు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపైనా సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి మహిళలను వేధించడం, మార్ఫింగ్ ఫొటోలు వైరల్ చేయడం, అసభ్యకర కామెంట్లు చేయడం, బెదిరింపు సందేశాలు పంపడం వంటి ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. డిజిటల్ ఆనవాళ్లు, ఐపీ అడ్రస్‌లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్ట్, ప్రతి కామెంట్, ప్రతి షేర్ శాశ్వత డిజిటల్ రికార్డుగా మిగిలిపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. “సోషల్ మీడియాలో ఏది చేసినా చెల్లిపోతుంది” అనే భావనతో వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చని స్పష్టం చేస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, అసభ్యకర ప్రవర్తన, వేధింపులు, ద్వేషపూరిత ప్రచారాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా పోస్టులు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.

కామెంట్ల విషయంలో కేర్‌ఫుల్..

సోషల్ మీడియా వేదికగా చేసే ప్రతి చర్య ఇప్పుడు సైబర్ నిఘా పరిధిలోకి వస్తోంది. కేవలం పోస్టులు మాత్రమే కాదు.. కామెంట్లు, రీ-షేర్లు, డైరెక్ట్ మెసేజ్‌లు, స్టోరీలు, రీల్స్ రూపంలో వచ్చే అభ్యంతరకర కంటెంట్‌పైనా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ప్రజా ప్రతినిధులు లేదా సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకర పోస్టులు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్న వారిని సైతం గుర్తించడం పోలీసులకు సులభమవుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్, మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే సందేశాలపై కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక బాధ్యతను విస్మరించి డిజిటల్ వేదికలను దుర్వినియోగం చేస్తే చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, సోషల్ మీడియా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఆత్మహత్య వంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని, అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కౌన్సెలర్ల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా కేవలం వినోదం లేదా అభిప్రాయాల వ్యక్తీకరణ వేదిక మాత్రమే కాదని, అవసరమైన సమయంలో ప్రాణాలను కాపాడే సాధనంగా కూడా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సైబర్ నిఘా ఒకవైపు నేరాలను అరికడుతుండగా, మరోవైపు వందలాది మంది జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us