AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం..! అంతర్రాష్ట్ర ముఠాపై పోలీసుల హై అలర్ట్

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రమాదకర ధార్ గ్యాంగ్ కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పగటిపూట దుప్పట్లు, బ్యాగులు అమ్మే సాధారణ వ్యాపారుల్లా నటిస్తూ రెక్కీ నిర్వహించడం, అర్ధరాత్రి వేళల్లో ఆయుధాలతో తలుపులు బద్దలుకొట్టి దోపిడీలకు పాల్పడటం ఈ అంతర్రాష్ట్ర ముఠా నైజం. తాజాగా ఒక రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాల్లో ముగ్గురు ముఠా సభ్యుల ఆనవాళ్లు లభించడంతో పోలీసులు రక్షణ వలయాన్ని బిగించారు. గతంలో చడ్డీ గ్యాంగ్, పార్ధీ గ్యాంగ్ లతో పాత అనుభవాలున్న నేపథ్యంలో..

పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం..! అంతర్రాష్ట్ర ముఠాపై పోలీసుల హై అలర్ట్
Dhar Gang Eluru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 17, 2026 | 3:48 PM

Share

ఏలూరు క్రైం, జూన్ 17: పశ్చిమ గోదావరి జిల్లా వాసులను అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన అత్యంత ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసు యంత్రాంగం నిర్ధారించింది. పగటిపూట నిరుపేద వ్యాపారుల్లా నటిస్తూ ఇళ్లను నోట్ చేసుకోవడం, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయుధాలతో విరుచుకుపడటం ఈ ముఠా నైజం. తాజాగా ఏలూరు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో ముగ్గురు ముఠా సభ్యుల కదలికలు స్పష్టంగా రికార్డు కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్షణ వలయాన్ని పోలీసులు మరింత బిగించారు.

విలాసవంతమైన కార్లలో ప్రయాణం.. హైవే ప్రాంతాలే లక్ష్యం:

ఈ ముఠా నేరాల శైలి అత్యంత వ్యూహాత్మకంగా, పోలీసులకు చిక్కని రీతిలో సాగుతుంది. పైకి సంచార జాతుల్లా కనిపించినప్పటికీ, వీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు విలాసవంతమైన కార్లు, రైళ్లను ఆశ్రయిస్తుంటారు. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పట్టణాలు, శివారు ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు హైవేల పక్కనే తాత్కాలికంగా తిష్ట వేసి, జనసంచారం తక్కువగా ఉండే ఖరీదైన ఇళ్లను టార్గెట్ చేస్తారు. ఒక ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడిన వెంటనే, మరుసటి రోజు ఉదయానికల్లా అక్కడి నుంచి మాయమైపోవడం వీరి ప్రత్యేకత. గతంలో రాజమహేంద్రవరంలోనూ హల్‌చల్ చేసిన ఈ ముఠా.. ప్రస్తుతం ఏలూరులోని మినీ బైపాస్, గూడ్స్ షెడ్ రోడ్డు పరిసరాల్లో సంచరించినట్లు ఆధారాలు లభించాయి.

పగలు దుప్పట్ల అమ్మకాలు.. అర్ధరాత్రి దాటితే మారణహోమం:

సుమారు 8 నుంచి 10 మంది సభ్యులుండే ఈ గ్యాంగ్‌లో ఇద్దరు, ముగ్గురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. పగటిపూట వీరంతా నగర వీధుల్లో తిరుగుతూ బ్యాగులు, దుప్పట్లు, గృహోపయోగ వస్తువులు విక్రయించే సాధారణ వ్యాపారుల్లా నటిస్తారు. ఈ క్రమంలోనే ఏ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? ఎటువైపు నుంచి లోపలికి వెళ్లవచ్చు? అనే అంశాలపై నిశితంగా రెక్కీ నిర్వహిస్తారు. ఇక అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తాళాలు పగలగొట్టి ఒకే రాత్రిలో వరుసగా 3 నుంచి 4 ఇళ్లలో చకచకా దోపిడీలు పూర్తి చేస్తారు. వీరు కేవలం దొంగతనాలతో ఆగిపోరు, ఒకవేళ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా అడ్డువస్తే, ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరని, వీరిది క్రూరమైన మనస్తత్వమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాత అనుభవాల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా:

ఏలూరు జిల్లా సరిహద్దుల్లో ఇలాంటి ఉత్తరాది ముఠాల కలకలం ఇదే మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం ఏలూరు శాంతినగర్‌లో చడ్డీ గ్యాంగ్ఒక ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించగా, స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో వారు పారిపోయారు. అలాగే గతేడాది పార్ధీ గ్యాంగ్ సైతం జిల్లా సరిహద్దుల్లో కలకలం రేపింది. ఈ పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ధార్ గ్యాంగ్ కదలికలపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏలూరు నగరంతో పాటు దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం వంటి పరిసర ప్రాంతాల్లోనూ ఈ ముఠా ఆనవాళ్లు కనిపించడంతో, నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి ప్రత్యేక బృందాలను దించారు.

అనుమానితులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వండి: ఎస్పీ ప్రతాప్ శివకిశోర్:

ప్రస్తుత పరిస్థితులపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ స్పందిస్తూ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివసించే వారు రాత్రి వేళల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. నగరంలో ఎక్కడైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద సంచార విక్రేతలు కనిపిస్తే వెంటనే అత్యవసర సహాయక నంబర్ డయల్ 112 కు గానీ, లేదా ఏలూరు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 83329 59174 కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి వేళల్లో ఇళ్ల బయట ఎలాంటి వింత శబ్దాలు వచ్చినా, కేకలు వినిపించినా తొందరపడి తలుపులు తీయవద్దని, లోపలి నుంచే సురక్షితంగా ఉంటూ పోలీసులను ఆశ్రయించాలని ఆయన ప్రజలను అప్రమత్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us