AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmangari Math : మొదటికొచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక.. ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదన్న మంత్రి

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామివారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాదం మళ్లీ మొదటికొచ్చింది...

Brahmangari Math : మొదటికొచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక..  ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదన్న మంత్రి
Brahmamgari Matham
Venkata Narayana
|

Updated on: Jun 13, 2021 | 3:17 PM

Share

Sri Potuluri Veera Brahmamgari Matam : కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో ఉన్న శ్రీ పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామివారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బ్రహ్మంగారి మఠాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకునే ఆలోచన లేదన్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శివస్వామిపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘శివ స్వామైనా, నేనైనా ఎవరు మఠాధిపతిని ప్రకటించినా చెల్లదు’ అని మంత్రి తేల్చిచెప్పారు. ఇందుకోసం చట్టానికి లోబడి కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రిజిస్టర్ అయిన మఠాధిపతుల తో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. 90 రోజుల్లోపు ధార్మికపరిషత్ కు వీలునామాలు అందాలన్న ఆయన…. కానీ అది జరగలేదని చెప్పారు.

“ఇప్పటికే అసిస్టెంట్ కమిషనర్ ను ఫిట్ పర్సన్ గా నియమించాం. త్వరలో కమిటీ వేసి మఠాధిపతి పై నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వానికి మఠం ను అధీనం లోకి తీసుకునే ఆలోచన లేదు” అని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఇలాఉంటే, మఠం పీఠాధిపతి ఎంపిక కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి 153 మంది పీఠాధిపతులతో కమిటీ ఏర్పాటు చేశామని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. వారి ఆధ్వర్యంలో పీఠాధిపతిని ఎంపిక చేసి పట్టాభిషేక కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు.

ఇలాఉండగా, ఈనెల 3వ తేదీన సంప్రదాయం ప్రకారం వారసత్వంగా గత ఏడు తరాలుగా వస్తోన్న ఆచారం ప్రకారం పెద్ద కుమారుడికే పీఠాధిపతి ఇచ్చారు.  8 మంది పీఠాధిపతులు…శ్రీ వీరబోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి సంతాన్ని ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి మాట్లాడారు. గత కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారమే అంతా నడచుకోవాలని మఠాధిపతుల వారసులకు సూచించారు. శ్రీపోతులూరి వీరబ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం రెండు రోజులపాటు పర్యటించి అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపారు.

బ్రహ్మంగారి మఠం సాంప్రదాయం ప్రకారమే గత ఏడు తరాలుగా పెద్దకుమారుడికే పీఠాధిపతి ఇచ్చారని జూన్ 3న శివస్వామి స్పష్టం చేశారు. దివంగత స్వామి వారి రెండో భార్యకు కూడా ఇదే విషయాన్ని చెప్పి నచ్చచెప్పే ప్రయత్నం చేశామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం చరిత్రలో వీలునామా ప్రకారం తదుపరి పీఠాధిపతి ఎంపిక ఎక్కడా జరగలేదని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి చెప్పారు. స్వామి వారి ఆస్తుల విషయంలో వీలునామాలు చెల్లుతాయి కానీ…పీఠాధిపతి ఎంపిక విషయంలో అది చెల్లదని స్పష్టం చేశారు.

బ్రహ్మాం గారి మఠం ప్రతిష్ట దిగజార్చకుండా ఉండేలా పీఠాధిపతి ఎంపిక జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని శివస్వామి చెప్పారు. కందిమల్లయ్యపల్లి గ్రామస్తుల అభిప్రాయం కూడా తీసుకున్నామన్నారు. వారసత్వమే పీఠాధిపతులుగా ఉండాలని వారంతా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  అతి త్వరలోనే పీఠాధిపతి ఎంపికను పూర్తి చేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

కాగా మఠం పూర్వాపరాల్లోకి వెళ్తే.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి కోసం వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి వారసుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది వివాదాస్పదంగా మారింది. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని పీఠాధిపతి చేయాలనేది చిక్కుముడిగా మారింది.

కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మఠంగా భావించి, దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వీరబ్రహ్మంగారి కుటుంబం నుంచి ఒకరు పీఠాధిపతిగా ఉంటున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటివరకు ఇలా ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు.

మొన్నటి వరకు బ్రహ్మంగారి పీఠాధిపతిగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి ఉండేవారు. అయితే, ఇటీవల ఆయన మరణించడంతో పీఠాధిపతి పదవి ఖాళీ అయింది. ఇప్పుడా పదవి ఎవరికి ఇవ్వాలనేది పీటముడిగా మారింది.

వీరభోగవసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతమ్మ 8 మంది సంతానం. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో రెండో భార్యను వివాహం చేసుకున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు. అయితే వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత మఠం పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై ఓ వీలునామా రాసి పెట్టారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు రాశారు. దీంతో ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

మఠాధిపతి నియామకం కోసం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ఇప్పటికే విచారణ చేపట్టారు. అయితే రాణాప్రతాప్‌ సమక్షంలోనే పీఠాధిపతికి అర్హులు నేనంటే నేనంటూ కుటుంబీకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ప్రాథమిక విచారణను మధ్యలోనే నిలిపివేశారు రాణాప్రతాప్‌.

అయితే, గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామికే ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. ఇంటికి పెద్ద కొడుకు కనుక ఆయనకే ఇవ్వాంటున్నారు. అయితే వీలునామాలో మాత్రం మొదటి భార్య రెండో కుమారుడి పేరు ఉంది. పెద్ద భార్య కిడ్నీ ఫెయిల్ అయిన సమయంలో ఎవరైతే కిడ్నీ ఇస్తారో తదుపరి పీఠాధిపతి వారేనని ప్రకటించారు. అప్పుడు రెండో కుమారుడు ముందుకు వచ్చాడు. దీంతో అతని పేరును వీలునామాలో రాశారు. దీంతో ఆయనకు కొందరు మద్దతు తెలుపుతున్నారు.

మరోవైపు, వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని, అయితే చిన్నవాడు కావడంతో తానే మఠాధిపత్యాన్ని స్వీకరిస్తానని చెబుతోంది చిన్న భార్య మారుతి లక్ష్మమ్మ. తన భర్త తర్వాత తనకే మఠాధిపత్యం వస్తుందని వీలునామాలో రాశారని వాదిస్తున్నారు. దీంతో అందరి అభిప్రాయాలు తెలుసుకున్న దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రాణాప్రతాప్‌ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు.

బ్రహ్మంగారి పీఠాధిపతి కావాలంటే దానికి కొన్ని అర్హతలుండాలి.. హిందూమతం, వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ధార్మిక గ్రంధాలలో, మఠానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఙానం తెలిసి ఉండాలి. మఠం శిష్యగణానికి జ్ఞానబోధ, సంప్రదాయాలను నేర్పించే సమర్థత ఉండాలి. క్రమశిక్షణలో, దాన్ని పాటించుటలోనూ నిశ్చయమైన నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారి పేరు ప్రతిపాదించిన తర్వాత దేవాదాయశాఖ కమిషనర్‌తో పాటు నలుగురు సభ్యులు పేరును ప్రతిపాదించి 90 రోజుల్లో దానిపై ధార్మిక పరిషత్‌ ఓ నిర్ణయం తీసుకుంటుంది. అందరి సమక్షంలో బ్రహ్మంగారి పీఠాధిపతి పేరును ప్రకటిస్తుంది.

Read also : Srisailam : శ్రీశైలంలో బయటపడుతోన్న ప్రాచీనకాలం నాటి అద్భుతాలు, మొన్న గుప్తనిధులు.. నేడు అజరామరమైన తామ్ర శాసనాలు

Follow Us