Char Dham Yatra: రేపే చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. యాత్ర పరిపూర్ణం అవ్వాలంటే ఈ తప్పులు చేయవద్దు..
ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రల్లో చార్‌ధామ్ యాత్ర కు ప్రముఖ స్థానం ఉంది. ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం యమునోత్రి నుంచి ప్రారంభమై బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించిన తర్వాత ముగుస్తుంది. అయితే ఈ ప్రయాణం చేసే సమయంలో కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. ఈ ప్రయాణంలో ఏమి చేయకూడదో తెలుసుకుందాం..

హిందూ మతంలోని నాలుగు ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ , కేదార్‌నాథ్‌లకు చేసే ప్రయాణాన్ని చార్ ధామ్ యాత్ర అంటారు. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర యమునోత్రి నుంచి మొదలవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు వెళతారు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని నియమాలు పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా చార్ ధామ్ యాత్రకు వెళుతుంటే.. పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
చార్ ధామ్ యాత్రలో ఈ చిన్న తప్పులు చేయకండి
తల్లిదండ్రుల అనుమతి: హిందూ మతంలో తల్లిదండ్రులను దేవునితో సమానంగా భావిస్తారు. కనుక ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే ముందు.. తమ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేపట్టే ప్రయాణం శుభప్రదంగా పరిగణించబడదు.
ఆహారానికి సంబంధించిన నియమాలు: చార్ ధామ్ యాత్ర సమయంలో మాంసాహార ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ మొత్తం ప్రయాణంలో, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం నుంచి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ యాత్ర చేసే సమయంలో మాంసాహారం తీసుకుంటూ చేసే ప్రయాణానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు.
సత్ప్రవర్తన: మతపరమైన ప్రయాణంలో మంచి ప్రవర్తనతో ఉండాలి. చార్ ధామ్ యాత్ర సమయంలో ఎవరితోనూ గొడవ పడకూడదు. దుర్భాషను ఉపయోగించకూడదు. యాత్ర సమయంలో ఎల్లప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. ప్రయాణంలో తప్పుడు ఆలోచనలు చేయరాదు. ఇలా తప్పుడు ఆలోచనలతో చేసే యాత్ర ఫలవంతం కాదు.
ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండండి: ప్రస్తుతం ప్రజలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినా.. మొబైల్, సోషల్ మీడియాను ఉపయోగించడంలో బిజీగా ఉంటున్నారు. ప్రజల దృష్టి భక్తిపై కాకుండా ఫోటోలు, వీడియోలు తీసుకోవడంపైనే ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలా చేయడం మంచిది కాదు. మీరు చార్ ధామ్ యాత్రకు వెళుతున్నట్లయితే వీలైనంత తక్కువగా మొబైల్ వాడండి. భక్తిలో నిమగ్నమై ఉండండి.
సూత కాలంలో ప్రయాణించవద్దు: సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవిస్తే, సూతక కాలం 12 నుంచి 13 రోజులు ఉంటుంది. సూత కాలంలో మతపరమైన తీర్థయాత్రలు చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల యాత్ర ఫలితం దక్కదని నమ్మకం.
సరైన దుస్తులను ఎంచుకోండి: ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళే సమయంలో ధరించే దుస్తుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చార్ ధామ్ యాత్ర సమయంలో ధరించే బట్టలు శుభ్రంగా ఉండాలి. మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రంగులను కూడా ఎంచుకోవాలి.
ఎక్కువగా మాట్లాడ వద్దు: హిందూ మతంలో మౌనం దేవుడిని చేరుకోవడానికి మార్గంగా చెబుతారు. కనుక ఆధ్యాత్మిక ప్రయాణం సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. చార్ ధామ్ యాత్ర చేసే సమయంలో మౌనంగా ఉండి భగవంతుడిని ధ్యానించడం ద్వారా చాలా శుభప్రదంగా, ఫలవంతంగా మారుతుంది. అదే సమయంలో అనవసరమైన సంభాషణల యాత్ర ప్రాముఖ్యతను తగ్గిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








