Chanakya Niti: ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే చాణుక్యుడు చెప్పినట్లు మీలో ఉండాల్సిన లక్షణాలు ఇవే..
మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొంతమందిని చూసిన వెంటనే.. వారిని ఇష్టపడతాం. వారిని చూస్తూ మంత్రముగ్ధులవుతాం. ఎందుకంటే వారి మాటలు, చర్యలు వారిని ఇష్టపడేలా చేస్తాయి. అయితే అందరికీ నచ్చే వ్యక్తిగా ఉండటం సాధ్యం కాదు. అది ఒక కళ.. అందుకనే ఆచార్య చాణక్య అందరినీ మనవైపు ఆకర్షించడానికి.. కొన్ని లక్షణాలను చెప్పాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది వివరించాడు. ఈ కొన్ని సూక్ష్మ విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటే.. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని ప్రేమించే విధంగా మారవచ్చు. కనుక ఈ రోజు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే చాణుక్యుడు చెప్పినట్లు మీలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..

ఎవరైనా సరే అందరి మనసులను గెలుచుకోవడం అంత సులభం కాదు. కొంతమందికి మన లక్షణాలు నచ్చవచ్చు, మరికొందరు మనల్ని చూసిన వెంటనే మనల్ని తిరస్కరించవచ్చు. ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చాలనే నియమం ఏదీ లేదు.. కానీ ప్రతి ఒక్కరూ తాము అందరికీ నచ్చాలని, తమ చుట్టూ చాలా మంది ఉండాలని, తమతో అందరూ మాట్లాడాలని కోరుకుంటారు. మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మనం నచ్చేలా చేసుకోవడం ఒక కళ. ఈ విషయంపై ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. ఈ లక్షణాలు ఉన్నవారే అందరినీ ఆకర్షిస్తారని చెప్పాడు. అలాంటి వారిని అందరూ ఇష్టపడతారని పేర్కొన్నాడు. ఆ లక్షణాలు ఏమిటంటే..
మధురంగా మాట్లాడం: నోరు మంచిది అయితే ఊరు మంచిది అని మన పెద్దలు అంటారు. అంటే మనకు మంచి చేసినా.. చెడు చేసినా..మనం మాట్లాడే మాటల ద్వారానే జరుగుతుందని. ఆహ్లాదకరంగా, మృదువుగా మాట్లాడేవారి మాటలను వినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారడానికి అర్థవంతమైన సంభాషణ చాలా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను స్పష్టంగా, సమర్థవంతంగా తెలియజేయడానికి కమ్యూనికేషన్ ముఖ్యం. స్పష్టమైన పదాలు అపార్థాలను నివారిస్తాయి.
నాయకత్వ లక్షణం: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా అందరికీ ఆదర్శంగా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇలా చేస్తే, ఎవరైనా సరే అందరి గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించుకోవచ్చు. కనుక నాయకత్వ గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించాడు. ఇలా చేయడం వలన మీరు అందరికీ దగ్గరవుతారు. ఇష్టుడిగా మారతారని చాణక్యుడు సలహా ఇచ్చాడు.
నిజాయితీ: ఈ రోజుల్లో నిజాయితీపరులను కనుగొనడం కష్టం. వంద మందిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే నిజాయితీపరులు ఉంటారు. ఏ సంబంధానికి అయినా నిజాయితీ పునాది. కనుక ప్రతి ఒకరు ఎల్లప్పుడూ నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. ఇది సంబంధంలో నమ్మకాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది.
వినయం : ఆచార్య చాణక్యుడు ప్రతి ఒక్కరికీ ఉండవలసిన మొదటి లక్షణం వినయం అని చెప్పాడు. వినయపూర్వకమైన వ్యక్తులు అందరితో త్వరగా కలిసిపోతారు. ఈ గుణం ఉన్న వ్యక్తులు ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వింటారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యక్తులు సహజంగానే అందరికీ నచ్చుతారు.
కరుణ: అందరికీ నచ్చాలంటే తమ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కరుణ చూపాలని చాణక్యుడు చెబుతున్నాడు. అవును తమ సమస్యలను, ఆందోళనలను అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే అందరికీ దగ్గరగా ఉండగలరు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం, మద్దతుగా నిలవడం ద్వారా సంబంధాలు బలపడతాయి. దయాగుణం ఉన్న వ్యక్తులను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని చాణక్యుడు చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








